Supreme Court: ఇక సుప్రీం కోర్టులో అన్ని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం! సిద్ధమవుతున్న యాప్
Supreme Court: అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అందుకోసం ఒక యాప్ ను సిద్ధం చేస్తోంది. ఆ యాప్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని తెలుస్తోంది. ఆ యాప్ బీటా వర్షన్ కు సానుకూల ఫీడ్ బ్యాక్ వస్తే, సుప్రీంకోర్టులోని అన్ని కేసుల లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.
Supreme Court: సుప్రీంకోర్టు కేసులన్నీ త్వరలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుపుతున్న అన్ని కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అన్ని కేసులను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి వీలుగా యాప్ బీటా వెర్షన్ ను పరీక్షిస్తున్నట్లు బార్ అండ్ బెంచ్ నివేదిక తెలిపింది. 2022 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అయితే, ఇతర రోజువారీ విచారణలను కూడా రెగ్యులర్ లైవ్ స్ట్రీమింగ్ కోసం పరిగణనలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి.
బీటా వర్షన్ పరీక్ష
అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రూపొందించిన యాప్ బీటా వర్షన్ ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారని సమాచారం. ఆ యాప్ బీటా వర్షన్ కు సానుకూల ఫీడ్ బ్యాక్ వస్తే, సుప్రీంకోర్టులోని అన్ని కేసుల లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. అన్ని కేసులను తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో కాకుండా సుప్రీంకోర్టు సొంత యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రాజ్యాంగ ధర్మాసనం కేసులు, ప్రజా ప్రాధాన్యమున్న విచారణలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. వాటిలో నీట్-యూజీ (neet ug) కేసు, ఆర్జీ కర్ కేసులు ఉన్నాయి. వాటి విచారణను ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్రిసభ్య ధర్మాసనం ప్రత్యక్ష ప్రసారం చేసింది.
సుప్రీంకోర్టు కేసుల ప్రత్యక్ష ప్రసారం
సుప్రీం కోర్టు (supreme court) కార్యకలాపాల వర్చువల్ యాక్సెస్ 2018 సంవత్సరంలో ప్రారంభమైంది. స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కేసులో చారిత్రాత్మక తీర్పు సందర్భంగా కోర్టు కార్యకలాపాలకు వర్చువల్ యాక్సెస్ కోసం సుప్రీంకోర్టు తలుపులు తెరిచింది. మైనర్లు, వైవాహిక సమస్యలు, లైంగిక దాడుల కేసులు మినహా రాజ్యాంగ, జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.