TDP Union Cabinet Berths : టీడీపీకి రెండు కేంద్ర మంత్రుల పదవులు- రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని పేర్లు ఖరారు?
TDP Union Cabinet Berths : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీకి రెండు కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయని సమాచారం. ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేబినెట్ హోదా, పెమ్మసానికి కేంద్ర సహాయమంత్రి పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
TDP Union Cabinet Berths : లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నాయి. రేపు(ఆదివారం) ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని దిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలకు కేంద్ర కేబినెట్ లో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీకి నాలుగు, జేడీయూకు రెండు కేబినెట్ మంత్రులు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు కేంద్ర మంత్రుల పదవులకు ఖరారైనట్లు తెలుస్తోంది. రామ్మోహన్‌నాయుడికి కేబినెట్ హోదా, పెమ్మసానికి కేంద్ర సహాయమంత్రి పదవి ఖరారు చేసినట్లు దిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీకి రెండు బెర్తులు?
నరేంద్ర మోదీ కేబినెట్‌లో రెండు కేంద్ర మంత్రుల పదవులు టీడీపీ ఖరారైనట్లు సమాచారం. అయితే ఆ పార్టీ నాలుగు బెర్త్‌లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు కేబినెట్, రెండు కేంద్ర సహాయ మంత్రుల పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్మోహన్ నాయుడు (37) తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణాంతరం 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. కింజరాపు ఎర్రన్నాయుడు 1996-1998 మధ్యకాలంలో ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, ఐకె గుజ్రాల్ కేబినెట్‌లలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. రామ్మోహన్ నాయుడు ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రామ్మోహన్ నాయుడికి మంచి వాక్చాతుర్యం ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఈ నైపుణ్యతలతో రామ్మోహన్ నాయుడు పేరును కేబినెట్ బెర్త్ కోసం టీడీపీ సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరో కేంద్ర మంత్రి పదవికి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఎన్నారై పెట్టుబడిదారులతో సంబంధాలు ఉండడంతో... రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన దోహదపడతాయని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు బీజేపీ అంగీకరిస్తే, లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు, అమలాపురానికి చెందిన జీఎం హరీష్ బాలయోగి పేరును చంద్రబాబు సిఫార్సు చేయవచ్చని తెలుస్తోంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్ట్‌లో మోదీ, కేబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
సంబంధిత కథనం