Narendra Modi : ప్రధానిగా మోదీ ప్రమాణం రేపే.. అతిథుల లిస్ట్- భద్రతా ఏర్పాట్ల వివరాలు..
ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిథుల లిస్ట్‌తో పాటు భద్రతా వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Modi oath ceremony : ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ.. జూన్ 9న, ఆదివారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలోని ఇతర సభ్యులు కూడా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారమహోత్సవానికి సంబంధించిన కీలక భద్రతా ఏర్పాట్లు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారీ భద్రతా ఏర్పాట్లు..
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ భారీ భద్రతా వలయంలోకి జారుకుంది. పారాగ్లైడర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, యూఏవీలు, యూఏఎస్, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లతో సహా సంప్రదాయేతర వైమానిక కార్యకలాపాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. వీటి వాడకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు.. జూన్ 9 నుంచి జూన్ 11 వరకు అమల్లో ఉంటాయని దిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా తెలిపారు.
జూన్ 9న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రపతి భవన్లో సమగ్ర భద్రతా సమీక్ష నిర్వహించారు.
ప్రమాణ స్వీకారమహోత్సవానికి హాజరయ్యే విదేశీ ప్రముఖుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు, ప్రముఖులు బస చేసే మూడు నిర్దేశిత హోటళ్లలో ప్రోటోకాల్స్ ను పెంచారు.
క్షేత్రస్థాయి భద్రతతో పాటు, దిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) పై నో-ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ దిల్లీ పోలీసులు శుక్రవారం పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు.
ప్రమాణ స్వీకారమహోత్సవం సందర్భంగా క్రిమినల్, సంఘ విద్రోహ శక్తులు లేదా ఉగ్రవాదుల నుంచి సంభావ్య బెదిరింపులను నివారించడానికి ఉద్దేశించిన సంప్రదాయేతర వైమానిక వేదికల కార్యకలాపాలను నిషేధించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం జరిమానా విధిస్తారు.
అతిథుల జాబితా ఇదే..!
PM Modi swearing in ceremony : తమ పాలసీలో ఇరుగుపొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇస్తుంది మోదీ అండ్ టీమ్. అందుకు తగ్గట్టుగానే.. మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్ దేశాధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా.. శనివారమే ఇండియాకు చేరుకుంటారు.
కాగా.. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజు సైతం మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరువుతారని తెలుస్తోంది. భారత్- మాల్దీవుల బంధం ఇటీవలి కాలంలో బలహీనపడిన విషయం తెలిసిందే. కాగా.. మహమ్మద్ రాకపై ఇంకా అధికారిక ప్రకటన లేదు.
వారణాసి నుంచి మోదీ గెలుపు..
నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి శుక్రవారం అధికారికంగా నియమించిన నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.
మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖలను కూడా రాష్ట్రపతికి అందజేశారు మోదీ.
వారణాసికి చెందిన బీజేపీ ప్రతినిధి బృందం 2024 లోక్ సభ విజయ ధ్రువీకరణ పత్రాన్ని దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. ప్రధాని మోదీకి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించేందుకు వారు గురువారం వారణాసి నుంచి దిల్లీకి వచ్చారు.
PM Modi latest news : వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం కాశీ ప్రజలతో తొలిసారి సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వారణాసికి చెందిన బీజేపీ నేతలు దిల్లీకి చేరుకోగానే ఆయనకు విజయ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ బీజేపీ నేతలకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోదీకి 6,12,970 ఓట్లు రాగా, అజయ్ రాయ్ కు 4,60,457 ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అథర్ జమాల్ లారీ 33,766 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఈ సర్టిఫికేట్‌ను ప్రధాని మోదీ గౌరవంగా స్వీకరించారని, ఇది ప్రజల తీర్పు అని బీజేపీ పేర్కొంది.
భారత ఎన్నికల సంఘం ప్రకారం, బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. ఇది 2019 లో దాని 303 స్థానాల కంటే చాలా తక్కువ. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ 292 సీట్లు గెలుచుకోగా, అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా అలయన్స్ 230 సీట్ల మార్కును దాటింది.
సంబంధిత కథనం