TDP Pathipati Pullarao: అగ్రిగోల్డ్‌ కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆస్తుల అటాచ్ చేసిన ఏపీ సిఐడి-ap cid attached former minister pathipati pullaraos properties in the agrigold case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cid Attached Former Minister Pathipati Pullarao's Properties In The Agrigold Case

TDP Pathipati Pullarao: అగ్రిగోల్డ్‌ కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆస్తుల అటాచ్ చేసిన ఏపీ సిఐడి

Sarath chandra.B HT Telugu
Feb 29, 2024 12:58 PM IST

TDP Pathipati Pullarao: లక్షలాది మంది ఖాతాదారుల్ని నిండా ముంచిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నాయకుడు పత్తిపాటి పుల్లారావుకు చెందిన ఆస్తుల్ని సిఐడి అటాచ్‌ చేసింది.

అగ్రిగోల్డ్‌ కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆస్తుల అటాచ్‌మెంట్
అగ్రిగోల్డ్‌ కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆస్తుల అటాచ్‌మెంట్

TDP Prathipati Pullarao: అగ్రిగోల్డ్ కేసులో టీడీపీ నాయకుడు పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ పేరిట ఉన్న ఆస్తుల్ని ఏపీ సిఐడి జప్తు చేసింది. ఏపీ హోంశాఖ Home Department ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన జీవో నంబర్ 17 ఆధారంగా ప్రత్తిపాటి పుల్లారావు ఆస్తుల్ని సిఐడి అటాచ్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

అగ్రిగోల్డ్‌ AgriGold వ్యవహారం పతాక స్థాయిలో ఉన్న సమయంలో టీడీపీ TDP నేతలపై ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో అగ్రిగోల్డ్ భూముల మార్పిడి వ్యవహారంపై సిఐడి ఇరకాటం ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పేరిట ఉన్న 12 ఎకరాల భూములపై సిఐడి దృష్టి సారించింది. ఇవన్నీ బినామీ లావాదేవీలుగా పేర్కొంటూ అటాచ్‌ చేసింది.

అగ్రిగోల్‌ వ్యవహారంలో 2015లో పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత నిడదవోలు, ఏలూరు టౌటౌన్, రాజమండ్రి, నంద్యాల 1, టూ టౌన్, ప్రకాశం జిల్లా కంభం, కందుకూరు, ఒంగోలు వన్ టౌన్, కడప జిల్లా చిన్న చౌక్, చిత్తూరు జిల్లా మదనపల్లె, నెల్లూరు టూటౌన్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట,చిలకలపూడి, గుంటూరు జిల్లా పెదకాకాని, మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోఅగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు.

సిఐడి APCIDదర్యాప్తు ఆధారంగా 2014లో అగ్రిగోల్డ్ డైరెక్టర్‌‌గా ఉన్న కనుకొల్లు ఉదయ్ దినకర్‌ నుంచి మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి పత్తిపాటి వెంకాయమ్మకు Pathipati Venkayamma బదిలీ అయిన భూముల్ని సిఐడి ఫిబ్రవరి 23న అటాచ్‌ చేసింది. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ నుంచి ప్రత్తిపాటి వెంకాయమ్మ 2015లో ఈ భూములు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. మొత్తం 12 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ నుంచి మాజీ మంత్రి కుటుంబానికి బదిలీ కాగా వాటిలో కొంత భూమిని మరికొందరి పేర్ల మీదకు మళ్లించారని గుర్తించారు.

ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ భూములు కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటే‌శ్వరరావు పేటి బదిలీ అయ్యాయి. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం గురిజేపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4లలో ఉన్న 2.48 ఎకరాల భూముల్ని ప్రత్తిపాటి సతీమణి నుంచి ఇతరులకు బదలాయించారు. సర్వే నంబర్‌ 104/5, 104/6, 103/2లలో ఉన్న 3.71 ఎకరాల భూమిని కామేపల్లి గ్రానైట్స్‌ పేరిట బదలాయించారు. ఇవన్నీ బినామీ లావాదేవీలని సిఐడి ఆరోపిస్తోంది.

వేల కోట్ల కుంభకోణం…

దేశ వ్యాప్తంగా దాదాపు 32లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.6,380కోట్ల రుపాయలు సేకరించిన అగ్రిగోల్డ్ కేసులో ప్రధాన నిందితులు బినామీల పేర్లతో ఆస్తుల్ని బదిలీ చేశారని సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న కనుకొల్లు ఉదయదినకర్‌, పత్తిపాటి తేనె వెంకాయమ్మ, కామేపల్లి లక్ష్మీప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్‌ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థలు బినామీలుగా అగ్రిగోల్డ్ నిందితులకు బినామీలుగా వ్యవహరించారని సిఐడి ఆరోపించింది.

ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్ డబ్బులతో సేకరించిన ఆస్తుల్ని బినామీల పేరిట బదలాయించారని సిఐడి ఆరోపించింది. సిఐడి వాదనలు పరిగణలోకి తీసుకున్న ఏలూరు ప్రత్యేక కోర్టు ఆస్తుల్ని అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

మరో 150 కంపెనీలపై అభియోగాలు...

అగ్రిగోల్డ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా పలు బినామీ సంస్థలకు ఆస్తుల్ని మళ్లించారనే అభియోగాలతో అయా సంస్థలు, వాటి బాధ్యులు, ఉద్యోగులను నిందితులుగా చేర్చనున్నట్లు ఏపీ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 150 బినామీ కంపెనీలతో పాటు అయా సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు, అధికారులు సిబ్బందిని కూడా విచారించనున్నట్లు కోర్టుకు వివరించింది. షెల్‌ కంపెనీలు, బినామీ కంపెనీల ద్వారా డిపాజిటర్ల సొమ్ము మళ్లించినట్టు సిఐడి అనుమానిస్తోంది.

WhatsApp channel