Agrigold Auction: అగ్రిగోల్డ్‌ కేసులో అప్డేట్... 150 కుర్చీల వేలానికి కోర్టు అనుమతి-cid allowed to auction 150 chairs in case of agrigold assets worth thousands of crores of rupees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Agrigold Auction: అగ్రిగోల్డ్‌ కేసులో అప్డేట్... 150 కుర్చీల వేలానికి కోర్టు అనుమతి

Agrigold Auction: అగ్రిగోల్డ్‌ కేసులో అప్డేట్... 150 కుర్చీల వేలానికి కోర్టు అనుమతి

Sarath chandra.B HT Telugu
Jan 12, 2024 08:29 AM IST

Agrigold Auction: లక్షలాది ఖాతాదారుల్ని నిండా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీసీఐడి ఎనిమిదేళ్లుగా కొండను తవ్వి ఎలుకలు పడుతోంది. ఏళ్ల తరబడి సాగుతున్న అగ్రిగోల్డ్ వ్యవహారంలో 150కుర్చీల వేలానికి ఏపీసిఐడి తాజాగా అనుమతులు సాధించింది.

అగ్రిగోల్డ్‌ కేసులో అప్డేట్
అగ్రిగోల్డ్‌ కేసులో అప్డేట్

Agrigold Auction: అగ్రిగోల్డ్‌ కేసులో ఏపీసిఐడి కీలక ముందడుగు వేసింది. లక్షలాదిమంది డిపాజిటర్లు మునిగిపోవడానికి కారణమైన వ్యవహారంలో సిడిఐ ఇటీవల ఓ విజయం సాధించింది. అగ్రిగోల్డ్‌ కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న 150కుర్చీలను వేలం వేయడానికి ఏలూరు కోర్టులో అనుమతి పొందారు.

వేల కోట్ల రుపాయల కుంభకోణంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రూ.940 కోట్లను అగ్రిగోల్డ్‌ నుంచి వసూలు చేసే విషయంలో ఏపీ సిఐడి ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కోట్ల ఖరీదు చేసే ఆస్తుల విషయాన్ని వదిలేసి కేసు దర్యాప్తును సాగదీస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మరోవైపు అగ్రిగోల్డ్‌ కేసుల్లో మరో 200మందిని నిందితులుగా చేర్చేందుకు ఏపీ సిఐడి ప్రయత్నాలు చేస్తోంది. అనుబంధ కంపెనీల ఉద్యోగులు, డైరెక్టర్లను కూడా ఈ కేసులో నిందితులుగా చూపనున్నారు. కొత్తగా నిందితుల్ని కేసులో చేరిస్తే వారందరికి నోటీసులు జారీ చేయడం, వారు బదులివ్వడం వంటి వాటికే మరో రెండు మూడేళ్ల సమయం పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

సాగని దర్యాప్తు…జరగని న్యాయం

ఐదారు రాష్ట్రాల్లో చిట్ల వ్యాపారం, వేల కోట్ల రుపాయల లావాదేవీలు, లక్షలాది మంది మదుపుదారుల్ని ముంచేసిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నిరీక్షణ తప్పడం లేదు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుందనుకున్న అంచనాలు తప్పేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి.

ఇప్పటికే అగ్రిగోల్డ్‌ ఆస్తుల్నిఈడీ అటాచ్‌ చేయగా, సిబిఐ కూడా దర్యాప్తు ప్రారంభించడంతో ఆస్తుల వేలంపై ప్రభావం చూపుతోంది. 2015లో ఏపీసీఐడి నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ నమోదు చేసింది. దీంతో అగ్రిగోల్డ్‌ కేసులో గుర్తించిన ఆస్తులన్నీ ఈడీ పరిధిలోకి వెళ్లిపోయాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో 30లక్షల మంది జనం నెత్తిన టోపీ పెట్టిన అగ్రిగోల్డ్ సేకరించిన ఆస్తుల్ని వేలం వేయడం ద్వారా ప్రభుత్వం డిపాజిటర్లకు చెల్లించిన డబ్బులు రాబట్టుకోవాలని భావించింది.స్తిరాస్తులపై ఈడీ అటాచ్‌మెంట్‌‌తో ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నారు.

అగ్రిగోల్డ్‌ అక్రమాలపై జాతీయ బ్యాంకులు సిబిఐకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్‌ సిఐడి దర్యాప్తు ప్రకారం అగ్రిగోల్డ్‌ అక్రమ వసూళ్లు దాదాపు రూ.6400కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేశారు. అదే సమయంలో అగ్రిగోల్డ్‌ ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో వేల కోట్ల రుపాయల ఆస్తుల్ని పొగేసినట్లు గుర్తించారు.

2015లో మొదలైన దర్యాప్తు….

2015లో వెలుగు చూసిన ఈ కేసులో సిఐడి తీరుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు… అగ్రిగోల్డ్ చెల్లించాల్సిన అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువగా ఉంటుందని తేల్చాయి. దీంతో ఆస్తుల్ని విక్రయించి డిపాజిటర్లకు డబ్బు చెల్లించవచ్చని భావించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌ వ్యాపారాలు నిర్వహించింది. డిపాజిటర్లకు పెద్దఎత్తున వడ్డీ ఆశచూపించి, పెట్టుబడులకు భూమిని ఇస్తామంటూ రకరకరాల పద్ధతుల్లో వేల కోట్ల రుపాయలు సేకరించారు.

అగ్రిగోల్డ్‌ వ్యవహారం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడంతో 2019 ఎన్నికలకు ముందు చిన్న మొత్తాలు డిపాజిట్లు చేసిన వారిని ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పది వేల లోపు డిపాజిటర్లకు మొదట నగదు చెల్లిస్తామని, ఆ తర్వాత రూ.20వేల లోపు డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని ప్రకటించారు. 2019లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ.940 కోట్ల రుపాయలను దశల వారీగా డిపాజిటర్లకు చెల్లించారు.

సిఐడి దర్యాప్తులో తాత్సారం…..

అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో దాదాపు ఎనిమిదేళ్లుగా సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రుపాయలు కేటాయించారు. రూ.940కోట్ల రుపాయల్ని బాధితులకు చెల్లించారు. మరోవైపు అగ్రిగోల్డ్‌ నుంచి ప్రభుత్వానికి మాత్రం ఒక్క రుపాయి కూడా దక్కలేదు. ఇకపై దక్కే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు.

ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదు.ఆర్ధిక నేరాల విషయంలో ఈడీ విచారణ పరిధిపై సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ తీర్పు వెలువడితే కానీ స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.

విలువైన వస్తువులు మాయం..

మరోవైపు అగ్రిగోల్డ్‌పై కేసు నమోదు తర్వాత వాటి కార్యాలయాల్లో ఉన్న ఫర్నీచర్, కంప్యూటర్లు, విలువైన సామాగ్రిని సిఐడి స్వాధీనం చేసుకుంది. వీటిలో విలువైన వస్తువులు ఇప్పటికే మాయం అయ్యాయి.

విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఉండాల్సిన సెంట్రల్ ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్లకు ఎప్పుడో రెక్కలు వచ్చాయి. సిఐడి రికార్డుల్లో చూపించిన చరాస్తుల్లో 150కుర్చీలను మాత్రం వేలం వేయడానికి ఏలూరు కోర్టు అనుమతించడంతో ఏపీ సిఐడి కొండను పట్టి ఎలుకను తవ్వినట్టుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.