AP Consultants: రాష్ట్రంలో కన్సల్టెంట్లు పడ్డారు, ఏపీ ప్రభుత్వ శాఖల్లో ఎడాపెడా కన్సల్టెంట్ల నియామకం, లక్షల్లో జీతాలు-consultants have arrived in the state ap government departments are hiring consultants in droves salaries in lakhs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Consultants: రాష్ట్రంలో కన్సల్టెంట్లు పడ్డారు, ఏపీ ప్రభుత్వ శాఖల్లో ఎడాపెడా కన్సల్టెంట్ల నియామకం, లక్షల్లో జీతాలు

AP Consultants: రాష్ట్రంలో కన్సల్టెంట్లు పడ్డారు, ఏపీ ప్రభుత్వ శాఖల్లో ఎడాపెడా కన్సల్టెంట్ల నియామకం, లక్షల్లో జీతాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 24, 2024 04:00 AM IST

AP Consultants: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో ఎడాపెడా కన్సల్టెంటంట్ల నియామకం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు విరుద్ధంగా లక్షలకు లక్షలు వేతనాలు చెల్లించి ఈ నియామకాలు జరుగుతున్నాయి.ఆర్థిక శాఖ గత ఆగస్టులో జారీ చేసిన జీవో 86 మార్గదర్శకాలతో సంబంధం లేకుండా ఈ నియామకాలు జరుగుతున్నాయి

ఏపీలో లక్షల వేతనాలతో కన్సల్టెంట్లు, కన్సల్టెన్సీల నియామకంపై చర్చ (ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో లక్షల వేతనాలతో కన్సల్టెంట్లు, కన్సల్టెన్సీల నియామకంపై చర్చ (ప్రతీకాత్మక చిత్రం)

AP Consultants: ఐఏఎస్‌ కమిటీలతో పనిలేదు, క్యాబినెట్‌ అమోదం అవసరం లేదు, ముఖ్యమంత్రి అంగీకారంతో పని లేకుండానే పలు శాఖల్లో కన్సల్టెన్సీలు, కన్సల్టెంట్ల నియామకం సాగిపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర సర్వీస్ అధికారులు కావాల్సినంత మంది ఉన్న శాఖల్లో కూడా ఏదో సాకుతో కన్సల్టెన్సీలు చొరబడుతున్నాయి.

yearly horoscope entry point

ఏపీలో ఇప్పుడు కన్సల్టెంట్ల సీజన్ నడుస్తోంది.అవసరం, అనుభవం, అర్హతలతో సంబంధం లేకుండా అస్మదీయుల్ని కన్సల్టెంట్ల పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి జొప్పిస్తున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌ 2047 విజన్‌‌లో భాగంగా కన్సల్టెంట్ల నియామకానికి విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో నెంబర్ 86 జారీ చేసినా దానిని పక్కన పడేసి ఈ నియామకాలు జరుగుతున్నాయి.

రాష్ట్ర సర్వీస్ అధికారుల సేవలు వినియోగించుకునే అవకాశం ఉన్న చోట కూడా బయటి వారితో పనులు చేయించడం, వారికి లక్షలకు లక్షలు వేతనాలు చెల్లించడం సాధారణమైపోయింది. ఈ కన్సల్టెంట్ల అవసరం ఏమిటనే చర్చ లేకుండానే ఐఏఎస్‌లు, ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారిని నియమించుకోవడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది.

ప్రభుత్వ శాఖల అవసరాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయడం కోసం కన్సల్టెంట్ల నియామకం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ తరహా నియామకాలు ఉన్నా ఈ స్థాయిలో లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

లక్షల్లో వేతనాలు…

కన్సల్టెంట్ల నియామకం వారికి చెల్లించాల్సిన జీతభత్యాలను కూడా అందులో ఖరారు చేశారు. ఆరు క్యాటగిరీలలో నియామకాల కోసం అర్హతలను నిర్ణయించారు. యంగ్ ప్రొఫెషనల్స్‌, జూనియర్ కన్సల్టెంట్స్‌, మిడిల్ లెవల్ కన్సల్టెంట్ -1, మిడిల్ లెవల్ కన్సల్టెంట్‌ లెవల్ 2, సీనియర్ కన్సల్టెంట్‌ , ఎక్స్‌పర్ట్‌ కన్సల్టెంట్‌లు వర్గీకరించారు. స్థాయిని బట్టి రూ.40-75వేలు, రూ.75వేలు-లక్ష, రూ.1లక్ష-రూ.15లక్షలు, రూ.1.5లక్షలు-2లక్షలు, రూ.2లక్షలు-2.5లక్షలు, రూ.3లక్షలు-5లక్షల వేతనాలను నెలకు నిర్ణయించారు. వారి స్థాయిని బట్టి అదనపు సదుపాయలను కూడా కల్పిస్తారు.

ఎవరి కోసం ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా కన్సల్టెన్సీ/ కన్సల్టెంట్‌ ట్రెండ్ నడుస్తోంది. ప్రభుత్వ శాఖలు చేసే పనులనే ఆకర్షణీయమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లుగా మలచి మభ్య పెట్టే తంతు చాలా ఏళ్లుగా సాగుతోంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు సేకరించే సమగ్ర సమాచారాన్ని అందమైన డాక్యుమెంట్లుగా, పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్లుగా మార్చేసి ముఖ్యమైన వారిని మభ్య పెట్టే కార్యక్రమాలు సాగుతున్నాయి.

ఈ క్రమంలో స్టేట్ సర్వీస్ అధికారులకు ఆలిండియా సర్వీస్ అధికారులకు మధ్య స్పష్టమై గ్యాప్ కనిపిస్తోంది. ఐఏఓస్‌లు తయారు చేసే నివేదికల్ని క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బంది లైట్ తీసుకుంటున్నారు. తమ విధులు, బాధ్యతల్లో బయటి వ్యక్తుల ప్రమేయం ఏమిటనే భావన చాలామంది అధికారుల్లో ఉంది. దీంతో సమీక్షల్లో తీసుకునే నిర్ణయాలకు క్షేత్రస్థాయిలో అమలుకు పొంతన కురదడం లేదు.

శాఖాధిపతులదే నిర్ణయం…

కన్సల్టెన్సీ ఏజెన్సీల నియామకం, కన్సల్టెంట్ల నియామకం పూర్తిగా అయా శాఖాధిపతుల చేతుల్లో ఉండటంతో ఎక్కడ ఏమి జరుగుతుందనేది బయటకు పొక్కడం లేదు. వీటి ద్వారా సాధించిన మార్పులు, విజయాలు కూడా పెద్దగా లేవనే భావన స్టేట్ సర్వీస్ అధికారుల్లో ఉంది. ముఖ్యమంత్రి స్థాయి సమీక్షల్లో ముఖస్తుతికి, శాఖాధిపతులు తీసుకునే కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కకుండా గోప్యత పాటించడానికి మాత్రమే ఏజెన్సీలు పనికొస్తాయనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ సర్వీసుల్లో పదవీ విరమణ చేసిన రిటైర్డ్‌ అధికారుల నుంచి కన్సల్టెంట్ల నియామకం వరకు ఐఏఎస్‌ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి దానిని క్యాబినెట్‌లో అమోదించి, ముఖ్యమంత్రి అమోదం తర్వాత నియామకాలు చేపట్టాల్సి ఉన్నా చాలా శాఖలు అవేమి పాటించడం లేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లకుండానే తమకు కావాల్సిన వారిని అయా పోస్టుల్లో లక్షలకు లక్షలు చెల్లించి నియమించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కన్సల్టెన్సీల నియామకాలైతే కోట్లలో కమిషన్లు చేతులు మారతాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్టేట్‌ సర్వీస్ అధికారులకు పనిచేయడం రాకపోతే ఆలిండియా సర్వీస్‌ అధికారులు ఏం చేస్తారనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. కన్సల్టెంట్ల మీద ఆధారపడకుండా నేరుగా పాలసీలు, పథకాలను ఐఏఎస్‌లు ఎందుకు రూపొందించలేరని కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక శాఖలో ఇలా...

ఆర్ధిక శాఖలో ఆరుగురు కన్సల్టెంట్లను నియమిస్తూ డిసెంబర్ 20వ తేదీన జీవో 302 జారీ చేశారు. ఆర్థిక శాఖలో వివిధ స్థాయిల్లో బాధ్యతలను నెరవేర్చడానికి వీరిని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డాటా అనలిసిస్‌, పాలసీ రీసెర్చ్‌, పీపీపీ ప్రాజెక్టులు, లీగల్ వ్యవహారాల కోసం వీరిని నియమించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఏడాది పాటు వీరి సేవల్ని వినియోగించుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆర్థికశాఖలో డి.షాలేం రాజుకు పీపీపీ ఎక్స్‌పర్ట్‌గా నెలకు రూ.2.4లక్షల వేతనం, శోభన్‌ బడ్జుగర్‌‌కు రూ.లక్షల వేతనం, వంశీకృష్ణారెడ్డికి రూ.2లక్షల వేతనం, ముగ్గురికి వాహనాల కోసం మరో రూ.35వేలు చెల్లించాలని నిర్ణయించారు. వీరితో సుబ్రహ్మణ్య వివేక్ భార్గవ్ ఓరుగంటికి రూ.1,37,500, వై.జగదీశ్వరరావుకు రూ.75వేలు, సూరజ్ గుళ్లపల్లికి రూ.55వేలు వేతనంగా నిర్ణయించారు.

గ్రామ,వార్డు సచివాలయ శాఖలో..

గ్రామ, వార్డుసచివాలయ శాఖలో కన్సల్టెంట్‌ నియామకం కోసం డిసెంబర్ 4న జీవో 21 జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సూపర్ సిక్స్‌ హామీల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం, పెన్షన్ల పంపిణీ, సున్నా వడ్డీలకు వీధి వ్యాపారులకు రుణాలు, వరద సహాయ చర్యల పర్యవేక్షణ, పాఠశాలల మరుగుదొడ్ల పర్యవేక్షణ, మిడ్‌ డే మీల్స్‌ నిర్వహణ, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వంటి పథకాల అమలుకు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌తో సమన్వయం కోసం రూ.2లక్షల వేతనంతో కన్సల్టెంట్‌ నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామ వార్డు సచివాలయశాఖలోనే వివిధ రకాల బాధ్యతల పర్యవేక్షణ కోసం నలుగురు కన్సల్టెంట్ల నియామకం కోసం డిసెంబర్ 19న మరో జీవో జారీ చేశారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ పేరుతో ఐటీ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న కన్సల్టెన్సీకి వేతనాలు చెల్లించడానికి వీలుగా జీవో 22 జారీచేశారు.

గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏపీ సేవా యాప్‌ నిర్వహణ, ఎన్‌బిఎం పోర్టల్, మీ సేవ పోర్టల్, అటెండెన్స్ యాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్‌ యాప్‌ వంటి నిర్వహణతో పాటు వివిధ రకాల ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అనుసంధానించడం కోసం నలుగురు వృత్తి నిపుణులకు ఏడాది రూ.1.84కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో టెక్ మేనేజర్‌ కన్సల్టెంట్‌కు నెలకు రూ.3.47లక్షల వేతనం, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌కు రూ.4.63లక్షలు, కన్సల్టెంట్‌కు రూ.3.18లక్షలు, మరో కన్సల్టెంట్‌కు రూ.2.72లక్షల వేతనంగా నిర్ణయించారు..

పర్యాటక శాఖలో ఇలా...

స్వర్ణాంధ్ర 2047లక్ష్యాలను చేరుకోడానికి కోసం పర్యాటక శాఖలో ఇద్దరు కన్సల్టెంట్ల నియామకం కోసం ఈ ఏడాది నవంబర్ 5న జీవో 140 జారీ చేశారు. స్వర్ణాంధ్ర 2047- 2ట్రిలియన్ల ఎకానమీ సాధించడం కోసం ఇద్దరు మిడ్‌ లెవల్ కన్సల్టెంట్లకు నెలకు రూ.2లక్షల చొప్పున వేతనం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

కన్సల్టెంట్ల నియామకాల్లో ఎవరిని నియమిస్తున్నారో వివరాలు లేకుండా గోప్యత పాటించడంపై కూడా సందేహాలు ఉన్నాయి. అన్ని నియామకాలను ముఖ్యమంత్రి స్థాయిలో అమోదించాల్సి ఉన్నా కేవలం పోస్టుల్ని మాత్రమే సృష్టించి ఆ తర్వాత తమకు కావాల్సిన వారిని వాటిలో నియమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

(ప్రభుత్వాలకు పాలసీలు అమ్ముతామండి మరో కథనంలో)

Whats_app_banner

సంబంధిత కథనం