Consultants Crossing Limits : హద్దులు దాటుతున్న పొలిటికల్ కన్సల్టెంట్లు….
Consultants Crossing Limits ఏపీ రాజకీయాలు పొలిటికల్ కన్సల్టెంట్ల చేతిలోచిక్కుకుని విలవిలలాడుతున్నాయి. అబద్దాల ప్రచారంలో అన్ని పార్టీలకు సేవలందిస్తున్న కన్సల్టెన్సీలు హద్దులు దాటేస్తున్నాయి. విమర్శ పరిధి, పరిమితి లేకుండా చెలరేగిపోతున్నాయి. తాము సేవలందించే పార్టీలను భుజానికెత్తుకునే క్రమంలో చేయకూడని పనులు చేసేస్తున్నాయి.
Consultants Crossing Limits ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలు మిగిలిన ఏ రాష్ట్రంలోను లేకపోవచ్చు. ఉప్పు నిప్పులా సాగే రాజకీయ పార్టీల మధ్యలో పెట్రోల్ పోయడానికి పొలిటికల్ కన్సల్టెంట్లు ప్రవేశించారు. తమ పైత్యాన్ని, ప్రకోపాన్ని చూపించుకోడానికి డబ్బులిస్తున్న పార్టీల మెప్పు పొందడానికి అవి హద్దులు దాటేస్తున్నాయి. ఈ తరహా ప్రచారాలు చూసిన జనం పార్టీల వైఖరి చూసి నవ్వుకుంటున్నారు. అన్ని పార్టీలు అదే దారిలో నడుస్తుండటం వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోకపోవడం జనాల్ని విస్తుపోయేలా చేస్తోంది.
రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకునే క్రమంలో వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు సహజమే. ఏపీలో ఆ విమర్శలు, ఆరోపణల్లో అసభ్య పదాలు ఎప్పుడో వచ్చేశాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా తమ హీరోయిజాన్ని చూపించుకోడానికి రాజకీయ పార్టీలు నోటికొచ్చినట్లు తిట్టడం పార్టీలకు అలవాటైపోయింది. ఇలా ప్రత్యర్థులపై నోరేసుకుని పడిపోవడం హీరోయిజంగా మారిపోయింది.
ఎన్నికలకు రెండేళ్ల ముందే ఏపీ రాజకీయాలు పొలిటికల్ కన్సల్టెంట్ల (Political Consultants ) చేతిలో బందీలైపోయినట్లు కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు రెండు తమ ప్రత్యర్ధుల్ని ఇరుకున పెట్టడానికి కోట్ల రుపాయలు వెచ్చించి కన్సల్టెంట్లను నియమించుకున్నాయి. ఈ క్రమంలో ఆదివారం చంద్రబాబు నాయుడుపై విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత వాటిని సమర్ధిస్తూ కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. ఈ పోస్టర్లు, ప్రకటనలు వేసింది ఎవరు అనేది తెలియకపోయినా దాని వెనుక రాజకీయ వ్యూహకర్తలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకు బాధ్యులు ఎవరనేది కూడా గుర్తించిన ప్రత్యర్ధి పార్టీ ఇంకో మెట్టు కిందకు దిగి పోస్టర్లు వేసింది.
ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రికి (Karnataka CM) వ్యతిరేకంగా పేటీఎం పోస్టర్ల ( paytm Posters ) తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య నాయకుడి కుటుంబానికి చెందిన మహిళ ఫోటోతో పోస్టర్లు వేశారు. అందులో మద్యం ముడుపులు స్వీకరించబడును అని పేర్కొన్నారు. ఓ రాజకీయ పార్టీ రంగుల్ని కలిపి పోస్టర్లు వేశారు. ఇది కాస్త ట్విట్టర్లో వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంతో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా విమర్శలు చేసుకోవడంతో అది కాస్త శృతి మించి చంద్రబాబు గతంలో మాట్లాడిన వ్యాఖ్యల్ని పోస్టర్లుగా వేసే వరకు వెళ్లింది. ఈ పోస్టర్ల వ్యవహారంపై ఎవరు, ఎవరిపై ఫిర్యాదులు చేసుకోకున్నా ఎదురుదాడికి మాత్రం దిగారు. ఈ క్రమంలో ఏ మాత్రం ఆలోచన, విచక్షణ లేకుండా వ్యవహరించారు. రాజకీయాల్లో సంబంధం లేని మహిళల్ని కించ పరచకూడదనే కనీస జ్ఞానం లేకుండా వ్యవహరించారు. విమర్శల పరిధి ఎంతవరకు అనే విషయంలో పొలిటికల్ స్ట్రాటజిస్టులకు ఎలాంటి పరిధి ఉండదన్నట్లు వ్యవహరించారు
ఈ వీడియో వచ్చిన గంట వ్యవధిలోనే మరో ఫోటో ట్విట్టర్లో ప్రత్యక్షమైంది. మరో రాజకీయ పార్టీకి చెందిన మహిళను నీచంగా కించపరుస్తూ దానిని తయారు చేశారు. ఒకరిపై ఒకరు విమర్శించుకునే క్రమంలోనే మహిళల్ని బలి పశువులుగా మార్చేశారు.
ఏపీలో రాజకీయ పార్టీలకు సేవలందిస్తున్న సంస్థల్లో ఎక్కువ ఉత్తరాది వ్యూహకర్తలు ఉన్నారు. సోషల్ మీడియాలో అబద్దాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పార్టీలు నియమించుకున్నాయి. ఈ తరహా సేవలకు అయా పార్టీలు కోట్ల రుపాయల్లో చెల్లిస్తున్నాయి. ఒక్కో పార్టీ వందలాది మందిని ఫెలోషిప్ పేరుతో నియమించుకుని తమ పార్టీల తరపున జనంలో ఎదుటి వారిపై విషాన్ని చిమ్మి తమవైపు తిప్పుకునే మంత్రాంగాన్ని ఫాలో అవుతున్నాయి. ఈ తరహా ప్రచారాల్లో నిజాలకంటే అబద్దాలే త్వరగా జనంలోకి వెళుతున్నాయి. అవి అబద్దమని జనానికి తెలియనంతగా జనంలో నాటుకుపోతున్నారు. గత ఎన్నికల్లో కూడా పార్టీలు ఈ తరహా సేవలు అందుకున్నా ఇప్పుడు హద్దులు చెరిపేసి, విచక్షణ మరచి చేస్తున్న దుష్ప్రచారాలు పార్టీల స్థాయిన జనానికి తెలిసేలా చేస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిని కూడా తమవైపు తిప్పుకోడానిక తంటాలు పడుతున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లలో వేల మంది ఫాలోవర్లు ఉండే వారిని తమకు అనుకూలంగా ట్వీట్ చేసినా, తమ వీడియోలు ప్రమోట్ చేసినా డబ్బులిస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. ఒక్కో ట్వీట్‌ని లైక్ కొట్టి రీ ట్వీట్ చేస్తే రూ.15చొప్పున చెల్లిస్తామనే మెసేజీలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా అబద్దాలను నిజమని నమ్మే జనం ఉన్నంత కాలం ఇలాంటి వ్యాపారాలు సాగుతూనే ఉంటాయి.