Political Consultancy : 2024 ఎన్నికలు ఐ ప్యాక్ వర్సెస్ షో టైమ్.. కన్సల్టెన్సీలపైనే పార్టీల నమ్మకం!
IPAC Vs Showtime : ఇప్పుడు ఎన్నికలంటే.. పార్టీలు వర్సెస్ పార్టీలులా కనిపించడం లేదు. పొలిటికల్ కన్సల్టెన్సీలు వర్సెస్ పొలిటికల్ కన్సల్టెన్సీలులా నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ కన్సల్టెన్సీలు.
ఏపీ రాజకీయాలు ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీలతో నడుస్తున్నాయి. వారు ఏది చెబితే.. అదే ఫైనల్. అక్కడ మీకు ఓటింగ్.. 50-50 ఛాన్స్ అని చెబితే.. పార్టీలు అక్కడ వాలిపోయి.. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తలు చెప్పే విషయాలను తప్పకుండా పాటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు పార్టీలే కాదు.. అటు పొలిటికల్ కన్సల్టెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మేఘాలయ రాజకీయ యుద్ధంలో షోటైమ్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఐ ప్యాక్ ఓ వైపు పని చేస్తే.. షోటైమ్ మరోవైపు పని చేస్తుంది. ఐ ప్యాక్ సృష్టికర్త, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేసిన రాబిన్ శర్మ షో టైమ్ పేరుతో కొత్త దుకాణం పెట్టారు. 2024 AP అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు రాజకీయ కన్సల్టెన్సీలు తలపడనున్నాయి.
మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నియమించిన షోటైమ్ కన్సల్టింగ్‌కు కలిసి వచ్చింది. దీంతో దీని సేవలు వినియోగించుకుంటున్న టీడీపీకి ఆశలు చిగురించాయి. ఈ కన్సల్టెన్సీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కోసం రాజకీయ వ్యూహాన్ని చేస్తోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఆంధ్రాకి సరైన వ్యూహాలు చేస్తే.. గెలుపు సాధ్యమేనని షో టైమ్ అభిప్రాయపడుతోంది. మైక్రో స్ట్రాటజీకి తగిన ప్రాముఖ్యతను ఇస్తోంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార YSRCPతో కలిసి పనిచేస్తున్న IPACతో షో టైమ్ తలపడుతుంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన IPAC అనేది రాజకీయ వర్గాల్లో స్థిరపడిన పేరు. అనేక మంది ప్రధాన నాయకులు, రాజకీయ పార్టీలను ఎన్నికల విజయాల కోసం ఐప్యాక్ కృషి చేసింది. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వంటి ప్రముఖులు రాజకీయ నేతలు ఈ ఐప్యాక్ ను వినియోగించుకున్నారు. షోటైమ్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ గతంలో IPACలో పని చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో IPAC వైఎస్సార్‌సీపీతో జతకట్టడం ఇది రెండోసారి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ తిరిగి ఎన్నిక కావాలని ఐప్యాక్ పోరాడుతుండగా, టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని షోటైమ్ చూస్తోంది.
IPACలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 500పైగా మంది పనిచేస్తున్నట్టుగా సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఐప్యాక్ టీమ్ అంచనా వేస్తోంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో ఈ టీమ్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. షోటైమ్‌లో 350 మందితో కూడిన బృందం ఉందని తెలుస్తోంది. మేఘాలయలో షోటైమ్ నుంచి దాదాపు 150 మంది వ్యక్తులు ఎన్‌పీపీ ప్రచారంలో సుమారు 14 నెలల పాటు పనిచేశారు.
రాజకీయ పార్టీ విజయానికి కారణమయ్యే అనేక అంశాలు ఉన్నప్పటికీ, కన్సల్టెన్సీ సంస్థలు ఈ కాలంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సర్వేలు, డేటా క్రంచింగ్, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఇతర పనుల్లో సహాయం చేయడానికి కన్సల్టెన్సీలు ఉపయోగపడుతున్నాయి. ప్రజల్లోకి దూసుకెళ్లేలా పంచ్ ఉండేలా కొటేషన్స్ కూడా నేతల నోటితో పలికిస్తాయి ఈ సంస్థలు.
ఆంధ్రప్రదేశ్‌లో షో టైమ్ కన్సల్టెన్సీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మేఘాలయ సీన్ ఏపీలోనూ రిపీట్ చేయాలని షో టైమ్ భావిస్తోంది. అయితే ఐప్యాక్ ఈ వ్యూహాల్లో ఎప్పటి నుంచో ఉంది.. మళ్లీ జగన్ వస్తేనే.. మీకు మంచిదని చెబుతోంది. రాబిన్ శర్మకు వైసీపీ వ్యూహాలపైన స్పష్టత ఉంది. టీడీపీకి ఎన్నికల సమయానికి వ్యూహకర్తగా అందించే.. సూచనలు పని చేస్తాయని షోటైమ్ నమ్ముతోంది. ఇక ఐ ప్యాక్ కూడా పూర్తి ధీమాతో ఉంది. మళ్లీ జగన్ ను అధికార పీఠం ఎక్కించేందుకు శ్రమిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అక్కడ పనిచేసే ఉద్యోగులకు కన్సల్టెన్సీలు భారీ ఎత్తున జీతాలు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికలు ఐప్యాక్ వర్సెస్ షో టైమ్ అనేలా ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చూడాలి..