Chandrababu Delhi Tour : అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు.. ఈనెల 7న ఢిల్లీకి సీఎం చంద్రబాబు!
Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. కీలక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై చర్చించనున్నారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, అమిత్ షా, రైల్వే శాఖ మంత్రిని చంద్రబాబు కలవనున్నారు. చంద్రబాబు పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాను చంద్రబాబు కలవనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా కలిసే అవకాశం ఉంది. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, ఇతర కేంద్ర ప్రాజెక్ట్‌లపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నట్టు సమాచారం. ఇటు విశాఖ రైల్వేజోన్ భూమిపూజ ముహూర్తంపైనా అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ.. ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సీఆర్‌డీఏకి అందనున్నాయి.
అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు రూ.49వేల కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో.. దానికి అనుగుణంగా సీఆర్‌డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ జరుగుతుందని.. కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రైల్వే జోన్ కార్యాలయం, ఇతర కార్యకలాపాలకు కావలసిన భూమిని రైల్వే శాఖకు అందించారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో.. విశాఖ రైల్వేజోన్ భూమిపూజ ముహూర్తంపైనా అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.