AP Rains : ఏపీపై ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, మరో మూడు రోజులు భారీ వర్షాలు
AP Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శనివారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
AP Rains : ఏపీలో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ జిల్లాల్లో వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీటర్ల వేగంతో వీచే అవకాశం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణకోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉంది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
జులైలో అధిక వర్షపాతం
బంగాళాఖాతంలో జులై 15వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడి, ఏపీ వైపుగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం 23వ తేదీన కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఆవర్తనాలు ఏర్పడి అల్పపీడనాలుగా మారేందుకు అనుకూల వాతావరణాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. అల్పపీడనాలు, ఆవర్తనాల ప్రభావంతో జులై నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. అలాగే జులై ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో రానున్న 4 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు అధికారులు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.
సంబంధిత కథనం