What is AQI: మీరుండే సిటీ వాతావరణం ఎంత సురక్షితమో ఎలా తెలుస్తుంది? ఈ సంఖ్య గురించి తెల్సుకోండి..
What is AQI: గాలి నాణ్యతను తెలిపే ఏక్యూఐ ఇండెక్స్ రీడింగ్ బట్టి కాలుష్యాన్ని తెల్సుకోవచ్చు. మీరున్న వాతావరణం ఎంత వరకూ సురక్షితమో అంచనాకు రావచ్చు. అదెలాగో చూడండి.
గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆక్సిజన్ ఎక్కువగా ఉండే చోట ఉండే మనుషులు మామూలు వారి కంటే ఎక్కువ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు అధ్యయనాల్లోవెల్లడయ్యింది. కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల వల్ల సాధారణంగా గాలి నాణ్యత పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మన చుట్టూ ఉండే గాలి ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే... కచ్చితంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( AQI) గురించి తెలుసుకోవాలి. దానిలోని సంఖ్యను బట్టి మన దగ్గర గాలి ఎలా ఉందనేది మనం అంచనా వేసుకోవచ్చు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పుడు చాలా వరకు మొబైల్ యాప్‌ల్లో అందుబాటులో ఉంటున్నాయి. మన ఫోన్‌లో వాతావరణం, ఉష్ణోగ్రతల్ని చూపించే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే దీన్ని మనం చూడవచ్చు. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా గాలి వాల్యూ ఎంత ఉంటే ఏమిటో తెలుస్తుంది. వాతావరణంలో కాలుష్య కారకాలు, గ్రౌండ్ లెవెల్ ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటివి ఉన్న పరిమాణాన్ని బట్టి దాని వాల్యూని లెక్కగడతారు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా అర్థం చేసుకోవాలి?
- ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో గాలి నాణ్యత 0 నుంచి 50 లోపు నమోదు అయితే ఆ గాలి చాలా స్వచ్ఛంగా ఉందని అర్థం. అతి కొద్ది మొత్తంలో మాత్రమే కాలుష్య కారకాలు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. వీటి వల్ల మనకు ఎలాంటి నష్టమూ ఉండదు.
- అదే ఏక్యూఐ 51 నుంచి 100 వరకు ఉన్నట్లయితే గాలి నాణ్యత మనం అనుమతించదగిన స్థాయిలో ఉందని అర్థం. చాలా సున్నితంగా, సెన్సిటివ్‌గా ఉండే వారికి ఈ గాలి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.
- ఏక్యూఐ వాల్యూ ఇండెక్స్ 101 నుంచి 150 మధ్య చూపిస్తున్నట్లయితే ప్రజలు దీని వల్ల కొన్ని అనారోగ్యాలకు గురికావచ్చని అర్థం.
- అదే 151 నుంచి 200 వరకు ఉన్నట్లయితే గాలి అనారోగ్యకరంగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. కొందరి ఆరోగ్యం దీని వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఊపిరితిత్తులు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులున్న వాళ్లమీద దీని ప్రభావం ఉంటుంది.
- ఏక్యూఐ ఇండెక్స్ వాల్యూ 201 నుంచి 300 వరకు ఉన్నట్లయితే గాలి చాలా అనారోగ్యకరంగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. సెన్సిటివ్‌గా ఉన్న వారి మీదే కాకుండా, ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీదా దీర్ఘకాలికంగా ఈ గాలి పీల్చడం వల్ల ప్రభావం ఉంటుంది.
- ఇక 301-400 కంటే ఎక్కువగా ఉంటే అది ప్రమాదకరమైన గాలిగా మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
- 401 -500 దీని వల్ల ఆరోగ్యవంతుల మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇదివరకే ఏవైనా వ్యాధులున్న వాళ్ల మీద విపరీతమైన ప్రభావం ఉంటుంది. అనారోగ్యాలు విషమించి ఎమర్జన్సీ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇలాంటి గాలి వల్ల ప్రతి ఒక్కరూ కూడా దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
టాపిక్