తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Session : అసెంబ్లీలో బీజేపీని సైలెంట్ చేసేందుకు టీఆర్ఎస్ పక్కా స్కెచ్

TS Assembly Session : అసెంబ్లీలో బీజేపీని సైలెంట్ చేసేందుకు టీఆర్ఎస్ పక్కా స్కెచ్

Anand Sai HT Telugu

05 September 2022, 20:09 IST

    • Telangana Assembly Session : మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలు యాక్షన్ ప్లాన్ రెడీ చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఈసారి బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. బీజేపీ మీద ఎదురుదాడి చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం 'వివక్ష', సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఇంధనం, ఎల్‌పీజీ, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వంటి వాటి మీద చర్చ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. మతతత్వాలను ప్రోత్సహించడంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని అధికార పార్టీ యోచిస్తోంది.

సభ ఎన్ని రోజులు జరగాలనే దానిపై క్లారిటీ లేకపోయినా సెప్టెంబర్ 6, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది. ఆ మూడు రోజుల్లో ఒక రోజు కేంద్రం వైఫల్యాలు, చర్యలపై చర్చకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీ వరకు గణేష్ నిమజ్జన బందోబస్త్‌తో పోలీసు యంత్రాంగం బిజీబిజీగా ఉండడంతో సెప్టెంబర్ 6న సభ ప్రారంభమైన తర్వాత వారం రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనలను అమలు చేయడంలో కేంద్రం వైఫల్యంపై చర్చ చేసే అవకాశం ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల కోత, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు రుణాల నిలిపివేత, వరి సేకరణపై ఆంక్షలు విధించడంలాంటి వాటిపై కూడా సమావేశాల్లో మాట్లాడుతారు. తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల మంజూరు, ఇతర అంశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా మాట్లాడే ఛాన్స్ ఉంది.

ఇన్ని రోజులూ సభలో టీఆర్‌ఎస్‌ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు బీజేపీ రాజకీయ కార్యాచరణను పెంచడంతో అధికార పార్టీ బీజేపీని టార్గెట్ చేసేందుకు రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది. టీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు ఎఐఎంఐఎం సభ్యుల మద్దతు ఉంది. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో గోషామహల్ శాసనసభ్యుడు టి.రాజా సింగ్ చర్లపల్లి జైలులో ఉండడంతో అసెంబ్లీకి హాజరుకావడం అనుమానంగానే కనిపిస్తోంది.

బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మాత్రమే మిగిలారు. ముగ్గురు బీజేపీ సభ్యులు మునుపటి బడ్జెట్ సెషన్‌లో మాట్లాడలేకపోయారు. ఎందుకంటే సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యారు. మరోవైపు అసెంబ్లీలో బీజేపీ శాసనసక్ష పక్ష నేతగా ఎవరు ఉంటారనే ఆసక్తి సహజంగానే అందరిలో నెలకొంది. ట్రిపుల్ ఆర్ లు వచ్చాకా కూడా రాజాసింగే బీజేఎల్పీ నేతగా వ్యవహరించారు. ఇటీవల ఓ వీడియో వివాదంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. చర్లపల్లి జైలుకు పంపించారు. ఇప్పుడు రఘునందనరావు, ఈటల రాజేందర్లో ఎవరో ఒకరు ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించాల్సి ఉందనే చర్చ ఉంది.

తదుపరి వ్యాసం