September 17th : బీజేపీ మాస్టర్ ప్లాన్.. అన్ని పార్టీలూ ఇరుకున పడ్డట్టేనా?-political heat in telangana over september 17th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 17th : బీజేపీ మాస్టర్ ప్లాన్.. అన్ని పార్టీలూ ఇరుకున పడ్డట్టేనా?

September 17th : బీజేపీ మాస్టర్ ప్లాన్.. అన్ని పార్టీలూ ఇరుకున పడ్డట్టేనా?

Anand Sai HT Telugu
Sep 04, 2022 03:05 PM IST

తెలంగాణలో ఇప్పుడు సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విమోచనం, విలీన దినోత్సవమని.. ఏళ్ల నుంచి ఎవరికి వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై బీజేపీకి మైలేజీ రాకూడదని.. కేసీఆర్ అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ అధిష్ఠానం చూస్తోంది.

సెప్టెంబర్ 17పై రాజకీయం
సెప్టెంబర్ 17పై రాజకీయం (twitter)

Hyderabad Liberation Day : 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమైంది. భారతదేశం అంతటా స్వాతంత్య్ర సంబరాలు జరిగాయి. దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలు మాత్రం ఆ సంబరాల్లో లేరు. నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించారు. హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఆపరేషన్ పోలో జరిగింది. ఎట్టకేలకు హైదరాబాద్ ఇండియాలో కలిసింది. అయితే ఈ కలయిక విమోచనం అని కొంతమంది, వీలినం అని మరికొంతమది తమ అభిప్రాయాలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఇటు టీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా ఈ విషయంతో మైలేజీ పెంచుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.

September 17th Politics : ఎప్పటి నుంచో సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని బీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంది. సెప్టెంబర్ 17ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అధికారికంగా నిర్వహించాలని మరో ఎత్తుగడ వేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు.. ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.

నిజాం రాజు భారతదేశంలో భాగం కావాలని కోరుకోలేదు. స్వతంత్రుడనని ప్రకటించుకున్నారు. అప్పటి కొన్ని సంస్థనాలు ఇండియాలో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్ రాజ్యం మాత్రం అలా లేదు. భారతదేశ మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్., భారత బలగాలను పంపించారు. ఆ తర్వాత నిజాం ఇండియాలో కలిపేస్తున్నట్టుగా ప్రకటించారు.

సెప్టెంబరు 17ని విమోచన దినంగా పాటించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం.. ఇవేమీ పట్టించుకోలేదు. 'ఇది రజాకార్లు చరిత్రను మంచిగా మార్చడానికి చేసిన ప్రయత్నం. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటున్న అమృత మహోత్సవంలో కూడా తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను, అమరవీరులను, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన అన్ని వర్గాల ప్రజలను ఎందుకు గుర్తించలేకపోతున్నాం.'అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

అఘాయిత్యాలు, చాలా గ్రామాల్లో ప్రజలు తమ పరువు, ఆస్తులు, ప్రాణాలను కోల్పోయారని ఎందుకు గుర్తించడం లేదు. రజాకార్ల పాలనను అంతమొందించేందుకు విరుచుకుపడిన సర్దార్ పటేల్, మన బలగాల వీరత్వాన్ని ఎందుకు మరిచిపోతున్నారు

- కిషన్ రెడ్డి

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. కేవలం కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కాకుండా ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రం నిర్వహించే కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినం పేరుతో మూడు రోజులు కార్యక్రమాలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బీజేపీకి ఎలాంటి మైలేజీ రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్ర్య వేడుకలు కూడా అందులో భాగంగానే నిర్వహించారని కొంతమంది చెబుతున్నారు.

September 17 National Integration Day : మరోవైపు AIMIM కూడా బైక్ తిరంగా ర్యాలీ, సామూహిక నమాజ్, బహిరంగ సభతో రెండు రోజుల కార్యక్రమాలు నిర్వహించనుంది. జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకొంటామని ప్రకటించింది. 'ఇది ఎన్నో ఏళ్ల పోరాటం. మనం లౌకిక ప్రజాస్వామ్య, స్వేచ్ఛా భారతదేశంలో చేరే వరకు ప్రజలు పోరాటం కొనసాగించారు. భారత్‌లో చేరడం పట్ల ఒక్క ముస్లిం కూడా అసంతృప్తిగా లేడు. దేశభక్తి కలిగిన ముస్లింలందరూ తమ ఇష్టానుసారం భారతదేశంలోనే ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నవారు పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.' అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

ఏ వేడుకలో పాల్గొంటారనే ప్రశ్నలకు సమాధానాలను అసదుద్దీన్ చెప్పేందుకు నిరాకరించారు. 'సెప్టెంబర్ 17ని జాతీయ సమైక్యత దినోత్సవంగా పిలవాలని మేం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజునే మేం దేశంలో కలిసిపోయాం.' అని అసదుద్దీన్ అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17పై అయోమయ పరిస్థితిలో పడినట్టుగా కనిపిస్తుంది. 'అవకాశవాద పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడింది మా పార్టీ. హైదరాబాద్ ప్రజలను విడిపించింది మా పార్టీ.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీ.హనుమంతరావు మాట్లాడుతూ.. ఈ గొప్ప చరిత్రాత్మక ఘటనల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఏవీ పాత్ర పోషించలేదు. మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, హోంమంత్రి వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌ను భారతదేశంలోకి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర నిరంకుశ పాలకుల నుంచి భారతదేశం, తెలంగాణ ప్రజలను విముక్తి చేయడానికి కాంగ్రెస్ అదే స్ఫూర్తితో పోరాడుతుంది.. అని వీహెచ్ అన్నారు.

మజ్లిస్ మాత్రం విమోచన దినోత్సవం కాదంటోంది. భారతదేశంలో విలీనమైన రోజుగా దీన్ని చెబుతోంది. పేరు ఏదైనా.. అధికారిక గుర్తింపు సెప్టెంబర్ 17వ తేదీకి రావాల్సి ఉంది. కానీ, ఆయా పార్టీల రాజకీయ అవసరాలు విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు సెప్టెంబర్ 17వ తేదీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. బీజేపీ. కాంగ్రెస్ ఈ విషయంలో ఏం మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది. మజ్లిస్, టీఆర్ఎస్ కూడా అయోమయంలో పడ్డాయి. బీజేపీ ట్రాప్ లో మిగతా పార్టీలు పడినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

IPL_Entry_Point