సీఎం గారూ.. పాలమూరు రండి, ప్రాజెక్టులపై చర్చిద్దాం - బండి సంజయ్ -bjp state president bandi sanjay kumar open letter to cm kcr over water projects ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సీఎం గారూ.. పాలమూరు రండి, ప్రాజెక్టులపై చర్చిద్దాం - బండి సంజయ్

సీఎం గారూ.. పాలమూరు రండి, ప్రాజెక్టులపై చర్చిద్దాం - బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Apr 16, 2022 01:02 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు పాలమూరు రండి అంటూ సవాల్ విసిరారు.

బండి సంజయ్ బహిరంగ లేఖ
బండి సంజయ్ బహిరంగ లేఖ (twitter)

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పాలమూరుకు రండి.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దామంటూ లేఖలో పేర్కొన్నారు. తాగు, సాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురపడ్డ పరిస్థితులను ప్రజా సంగ్రామ యాత్రలో చూస్తున్నామని చెప్పారు. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో టీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి సరైన వాటా దక్కలేదని.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు టీఆర్‌ఎస్‌ సిద్ధమా? అని బండి సంజయ్‌ నిలదీశారు. పాలమూరు ప్రజల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని దయ్యబట్టారు. రైతుల సాగునీటి కష్టాలన్ని తీర్చాలనే శ్రద్ధ సర్కార్ లో ఏమాత్రం కనిపించటం లేదని ఆక్షేపించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని... వలసల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాజెక్టులపై 2 లక్షల రూపాయలను ఖర్చు చేశారని.. మరి ఈ డబ్బంతా ఎవరి ఖాతాలోకి పోతుందని ప్రశ్నించారు. కేవలం ముఖ్యమంత్రి కుటంబానికి, బంధువులకు చేరిందని ఆరోపించారు.

అలంపూర్ నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ చేపట్టిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషమని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చటం లేదని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర కాదన్న ఆయన… బండి సంజయ్ ది ప్రజా వంచన యాత్రం
అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయనే ఆందోళన కేటీఆర్‌లో కన్పిస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం‌ కేసీఆర్ సంతకం వలనే కృష్ణాజిలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న రఘనందన్… 290టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్‌కు తెలియకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

IPL_Entry_Point