Places to Visit in September । సెప్టెంబర్‌లో విహారానికి ఈ 5 ప్రదేశాలు ఉత్తమం!-5 best places to visit in september month don t miss ziro music festival ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Places To Visit In September । సెప్టెంబర్‌లో విహారానికి ఈ 5 ప్రదేశాలు ఉత్తమం!

Places to Visit in September । సెప్టెంబర్‌లో విహారానికి ఈ 5 ప్రదేశాలు ఉత్తమం!

HT Telugu Desk HT Telugu
Sep 04, 2022 11:22 AM IST

మాన్‌సూన్ ఇక చివరకు వచ్చేశాం. ఈ సమయంలో వాతావరణం చాలా చోట్ల ఆహ్లాదరకంగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో మీరు విహారయాత్రకు వెళ్లాలంటే అద్భుతమైన ప్రదేశాల జాబితా ఇక్కడ చూడండి.

Ziro Music Festival Arunachal Pradesh
Ziro Music Festival Arunachal Pradesh

భారతదేశంలో వర్షాకాలాన్ని ఆస్వాదించటానికి ఇక మిగిలింది ఒక నెల మాత్రమే. సెప్టెంబర్ నెల విహారయాత్రలకు ఉత్తమ కాలంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నెలలో వాతావరణం పూర్తి ఆహ్లాదకరంగా మారుతుంది. ఎక్కువగా వర్షాలు లేదా ఎక్కువగా ఎండలు అనేవి ఉండవు. చాలా ప్రాంతాలు అక్కడక్కడా కురిసే చిరుజల్లులతో చల్లటి అనుభూతిని కలిగిస్తాయి.

మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే ఈ సెప్టెంబర్ నెలలో పర్యటించేందుకు అనువైన పర్యాటక ప్రాంతాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. మీరు మీ బ్యాగ్‌లను సర్దుకుని మీ ఇష్టమైన పర్యాటక కేంద్రాలకు వెళ్లి సేదతీరండి. ఈ సెప్టెంబర్ నెలను పూర్తిగా, మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. సెప్టెంబర్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన 5 ఉత్తమ పర్యాటక కేంద్రాలు ఇవే.

కోవలం, కేరళ

ఈ అందమైన తీర పట్టణం మీరు ఈ సెప్టెంబర్‌లో తప్పక సందర్శించాలి. ఈ ప్రాంతంలో వర్షాకాలం ఇప్పుడే ముగిసింది, వాతావరణం తాజాగా, దుమ్ము రహితంగా మారింది. ఒకవైపు సముద్రం, మరొకవైపు పచ్చని భూభాగాలతో ఈ ప్రాంతం ఎంతో కమనీయంగా ఉంటుంది.

కోవలంలో హవా బీచ్, సముద్ర బీచ్‌లతో సహా మరెన్నో అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద చికిత్సలు, పారాసైలింగ్, యోగా-ధ్యానం వంటి కార్యకలాపాలలో మునిగితేలుస్తూ శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతిని పొందవచ్చు.

ఊటీ, తమిళనాడు

ఊటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సముద్ర మట్టానికి 2240 మీటర్ల ఎత్తులో ఉండే ఈ హిల్ స్టేషన్ మీ కళ్లముందు ఎన్నో ఉత్కంఠభరితమైన దృశ్యాలను సాక్షాత్కరింపజేస్తుంది. పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన గాలి, కనువిందుచేసే తేయాకు తోటలతో మొత్తంగా ఈ ప్రాంతం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఊటీలో అవలాంచి సరస్సు, దొడ్డబెట్ట శిఖరం, కల్హట్టి జలపాతాలు, మదుమలై నేషనల్ పార్క్, పైకారా జలపాతాలు మొదలైన టూరింగ్ స్పాట్స్ ఉన్నాయి. వీటితో పాటు హైకింగ్, ట్రెక్కింగ్, కయాకింగ్, గిరిజన స్థావరాలను అన్వేషించడం వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయవచ్చు.

జిరో, అరుణాచల్ ప్రదేశ్

మీరు సంగీత ప్రియులైతే అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో ప్రాంతం ఈ సెప్టెంబర్‌లో మీరు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక కేంద్రం. ఈ సమయంలో ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇంకా ఇక్కడి ప్రకృతి సౌందర్యం, ఇక్కడి వాతావరణం గురించి ఎంత చెప్పినా తకువే. పచ్చని వరి పొలాలు, దట్టమైన వెదురు అడవులతో ఈ ప్రాంతం మీరు ఏ సమయంలో వెళ్లినా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవటం కూడా సులువే. జిరో నుంచి 202 కి.మీ దూరంలో జోర్హాట్ విమానాశ్రయం, 280 కి.మీలలో తేజ్‌పూర్ విమానాశ్రయాలు ఉన్నాయి. రైలు మార్గం ద్వారా తేజ్‌పూర్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి జిరో ప్రయాణించవచ్చు.

కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హిల్ టౌన్ కాలింపాంగ్‌ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈ పట్టణం సందర్శించడం మీకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగిస్తుంది. విశాలమైన లోయ ప్రాంతాలు, బౌద్ధ ఆరామాలు, చర్చిలు, టిబెటన్ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన కాలింపాంగ్ మిమ్మల్ని మరో కొత్త లోకంలో విహరింపజేస్తుంది. ఇక్కడ మాక్‌ఫార్లేన్ మెమోరియల్ చర్చి, డియోలో పార్క్ వంటి కొలొనియల్ ఎరా నాటి భవనాలను చూడవచ్చు. కాలింపాంగ్‌కు చేరుకోవటానికి సమీపంలో బాగ్డోగ్రా విమానాశ్రయం కేవలం ఈ ప్రాంతం నుంచి 79 కి.మీ దూరంలో ఉండగా న్యూ జల్పైగురి స్టేషన్ 77 కి.మీ దూరంలో ఉంది.

షిల్లాంగ్, మేఘాలయ

మేఘాలయ రాజధాని షిల్లాంగ్, ప్రకృతి సౌందర్యాలకు నెలవైన అన్ని పర్యాటక ప్రదేశాలకు రాణిగా పరిగణిస్తారు. అంతటి ప్రకృతి సౌందర్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక్కడి ఉమ్‌గోట్ నదిలోని స్పష్టమైన నీటిలో చేసే పడవ ప్రయాణం మీకు గాలిలో తేలిపోతున్న అనుభూతిని, జీవితంలో మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. మావ్‌టెన్ విలేజ్‌లో ఉన్న ఓడ్ రింగాయ్ నేచురల్ పూల్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంకా బోటింగ్, ఫిషింగ్, క్లిఫ్ జంపింగ్, స్కూబా డైవింగ్, కయాకింగ్, స్నార్కెలింగ్., సస్పెన్షన్ బ్రిడ్జిపై నడక ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్