Honeymoon Places | ప్రకృతి ఒడిలో మమేకం.. ఏకాంతానికి ప్రతిరూపం-top 5 most romantic honeymoon places in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Top 5 Most Romantic Honeymoon Places In India

Honeymoon Places | ప్రకృతి ఒడిలో మమేకం.. ఏకాంతానికి ప్రతిరూపం

Maragani Govardhan HT Telugu
Nov 25, 2021 03:15 PM IST

అబ్బురపరిచే అనుభూతులను పొందడానికి హనీమూన్ గొప్పగా ప్లాన్ చేసుకుంటారు. అయితే హనీమూన్ అనగానే చాలా మంది విదేశాల్లోని ప్రఖ్యాత ప్రదేశాలే గుర్తుకువస్తాయి. కానీ అంతకుమించి మైమమరిపించే ప్రదేశాలు, ప్రశాంత వాతావరణం మనదేశంలోనే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మున్నార్
మున్నార్

వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే అద్భుతమైన ఘట్టం. అయితే నూరేళ్ల బంధాన్ని మూడు మూళ్లతో మూడు సెకన్లలో ఒక్కటి చేసినప్పటికీ ఇరువురి మనస్సులు కలిస్తేనే ఆ బంధానికి విలువ దక్కుతుంది. అలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఏకాంతం తప్పనిసరి. అందుకే కొత్తగా వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో హనీమూన్ కు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ప్రకృతి అందాలు ఓ పక్క.. వలిచిన వారి సోగసులు మరోపక్క కలగలిపి మనిషికి తెలియని, మనస్సు మరువని సంభ్రమాశ్చర్యాలను గొలిపే ఆస్వాదనను పొందుతారు. ప్రకృతి ఒడిలో మమేకమై శృంగారపు అంచుకు చేరతారు. ఇలాంటి అబ్బురపరిచే అనుభూతులను పొందడానికి హనీమూన్ గొప్పగా ప్లాన్ చేసుకుంటారు. అయితే చాలామందికి హనీమూన్ అనగానే విదేశాల్లోని ప్రఖ్యాత ప్రదేశాలే గుర్తుకువస్తాయి. కానీ అంతకుమించి మైమమరిపించే ప్రదేశాలు, ప్రశాంత వాతావరణం మనదేశంలోనే ఉన్నాయి. వైవాహిక జీవితాన్ని నూతనంగా ఆరంభించిన జంటల కోసం భారత్ లో ఉన్న అద్భుతమైన హనీమూన్ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

గోవా..

పర్యాటక ప్రదేశాల్లో గోవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో గోవా ముందు వరుసలో ఉంటుంది. అబ్బురపరిచే సముద్రతీరాలు, మతిపోగొట్టే పొర్చుగీస్ ఆర్కిటెక్చర్, అదిరిపోయే రుచికరమైన విందు, వినోదాలకు గోవా పెట్టింది పేరు. ముఖ్యంగా ఫోర్ట్ చపోరా వద్ద సూర్యాస్తమయం అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. సముద్రతీరాల్లో మీ జీవిత భాగస్వామితో కలిసి వాక్ చేయడమే కాకుండా నైట్ క్లబ్స్ లో వారితో కలిపి డ్యాన్స్ చేయవచ్చు. వివాహ ఉత్సవాలతో అలసిన మీకు ఇక్కడ మసాజింగ్ సెంటర్లత కొంత విశ్రాంతి పొందవచ్చు. భారత్ లోని అన్ని ప్రముఖ నగరాల నుంచి వాయు, రైలు, రోడ్డు మార్గాలు ఇక్కడికి ఉన్నాయి.

అండమాన్(నీల్ ఐలాండ్)..

హనీమూన్ కు ప్రఖ్యాతగాంచిన ప్రదేశాల జాబితాలో అండమాన్ కూడా ముందువరుసలో ఉంటుంది. సూర్యోదయం వేళలో ఇక్కడ సముద్రతీర ప్రాంతంలో నెలకొనే దృశ్యం వర్ణణాతీతం. బీచ్ ల్లో సేదతీరేందుకు తగినన్నీ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. మీ భాగస్వామితో కలిసి వాటర్ స్పోర్ట్స్ ఆడుతూ మంచి విశ్రాంతి పొందవచ్చు. మాల్దీవులు, థాయ్ లాండ్ లాంటి దేశాలకు వెళ్లకుండానే అక్కడ దొరికే ఫన్ అండమాన్ లో ఉంటుంది. ఆసియాలోని అత్యుత్తమ వైట్ శాండ్ బీచ్ లు ఇక్కడే ఉన్నాయి. మీ భాగస్వామితో కలిసి రాత్రి సమయంలో నక్షత్రాల కింద సముద్ర తీర ప్రాంతంలో క్యాండిల్ లైట్ డిన్నర్ అనుభూతి ఇంకెక్కడ పొందలేరు. అంతేకాకుండా స్వచ్ఛమైన నీటికి ప్రతీకగా ఇక్కడ జలాలు కనువిందు చేస్తాయి. సూర్యాస్తసమయాన్ని అస్సలు మిస్ చేయకూడదు. ఇందుకోసం ప్రత్యేకంగా సన్ సెట్ పాయింట్ పశ్చిమ సముద్రతీరప్రాంతంలో ఏర్పాటు చేశారు.

కేరళ(మున్నార్)..

పర్వతాలు, సరస్సులు, కాఫీ తోటలు, హౌస్ బోట్లు, స్పా లాంటి విభిన్న అనుభూతులు ఒకే చోట పొందాలంటే మీరు కేరళ వెళ్లాల్సిందే. ఎందుకంటే కేరళ సహజమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆకుపచ్చిని తేయాకు తోటల నడుమ వుడెన్ కాటేజెస్ వరండాలో కూర్చొని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా కేరళలోని బ్యాక్ వాటర్స్ ఇక్కడి అందాలను రెట్టింపు చెస్తాయి. అలెపీలో హౌస్ బోట్ అద్దెకు తీసుకొని పడవలో ఉల్లాసభరితమైన ప్రయాణం చేయవచ్చు. కారు లేదా బైక్ కిరాయికి తీసుకొని పర్వతాలపై రైడ్ కు వెళ్లవచ్చు. ఇవి కాకుండా లగ్జరీ స్పా సెషన్లు ఇక్కడ బోలెడున్నాయి.

కశ్మీర్..

కశ్మీర్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మందు సౌందర్యాన్ని వీక్షించాలంటే చాలా మంది స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకుంటారు. మనకు ఆ అవసరం లేదు. కశ్మీర్ అందాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ముఖ్యంగా హనీమూన్ లవర్స్ కు ఈ ప్రదేశం మంచి జ్ఞాపకాలను అందిస్తుంది. తెల్లని మంచు, చల్లని వాతావరణం, ఇంటి ముందు బోగి మంటలతో సాయంత్రం వేళలో మీ జీవిత భాగస్వామితో భూతల స్వర్గాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ చూసేందుకు ఎన్నో అపురూపమైన ప్రదేశాలు ఉన్నాయి. సముద్రమట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న గుల్మార్గ్ అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్ట్రాబెర్రీ వ్యాలీలో స్ట్రాబెర్రీ పండ్లకు ప్రసిద్ధి చెందింది.

రాజస్థాన్(ఉదయ్ పుర్)..

రాజస్థాన్ కూడా హనీమూన్ కపుల్స్ మంచి పర్యాటక ప్రదేశంగా మారింది. ముఖ్యంగా ఉదయ్ పుర్ లో ఉండే అద్భుతమైన కోటలు, సుందర సరస్సులు ఈ నగరాన్ని రొమాంటింగ్ ప్రదేశంగా మార్చాయి. ఉదయ్ పుర్ వీధుల గుండా వెళ్తుంటే రంగుల వేషధారణలు అక్కడ సంస్కృతి ప్రతిబింబిస్తాయి. సరస్సుల్లో పడవ ప్రయాణాలు, కళా వైభవం అబ్బురపరుస్తాయి. వివాహం తర్వాత తీసుకునే పోస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీకి ఉదయ్ పుర్ అత్యుత్తమంగా ఉంటుంది. రూఫ్ టాప్ రెస్టారెంట్లలో విందు మంచి అనుభూతిని మిగులుస్తుంది.

WhatsApp channel

టాపిక్