తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Padayatra: కేటీఆర్.. నువ్వు ఉద్యమకారుడివా? కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

Revanth reddy Padayatra: కేటీఆర్.. నువ్వు ఉద్యమకారుడివా? కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

HT Telugu Desk HT Telugu

05 March 2023, 10:53 IST

google News
    • Revanth reddy padayatra in Sircilla: రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన… మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు ఇవాళ… వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో యాత్ర కొనసాగనుంది.
పాదయాత్రలో రేవంత్ రెడ్డి
పాదయాత్రలో రేవంత్ రెడ్డి

పాదయాత్రలో రేవంత్ రెడ్డి

Revanth reddy Fires ON KTR: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ పిచ్చి కుక్కలా మారి కరుస్తున్నారంటూ మండిపడ్డారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శనివారం సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని పద్మానగర్ నుంచి సిరిసిల్ల వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల నేతన్న చౌక్ లో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

సిరిసిల్ల సభ అంటే భయపడ్డామని.. కేటీఆర్ కు భయపడి ఎవరూ రారని అనుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కొనసాగుతున్న హాత్ సే హాత్ సే జోడో యాత్రలో అత్యధికంగా సిరిసిల్ల సభకు హాజరయ్యారని అన్నారు. తొలి తెలంగాణ ఉద్యమంలో నేతన్నల బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చేవరకు లక్ష్మణ్ బాపూజీ ఏ పదవీ తీసుకోలేదన్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ పార్టీ పెడతా అంటే తన ఇంటిని ఆఫీసుగా ఇచ్చారని చెప్పారు. అప్పుడు కేకే మహేందర్ రెడ్డి అండగా నిలిచారని... కేసీఆర్ ను ఎవరూ నమ్మని పరిస్థితుల్లో 2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ కేసీఆర్ కు పార్టీ ఆఫీసు కోసం తన ఇంటిని ఇచ్చి ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి చివరి చూపులకు కూడా వెళ్లని దుర్మార్గుడు, నీచుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు.

" 2001 నుంచి 2009 వరకు కేసీఆర్ కు సేవలందించిన కేకే మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్. సాధించిన తెలంగాణను కాలనాగు లాంటి కల్వకుంట్ల కుటుంబం కాటేస్తోంది. 15 ఏళ్లుగా ఎంత కష్టమొచ్చినా, ఆస్తులు పోగొట్టుకున్నా కేకే మీకు తోడుగా ఉంటున్నారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ పిచ్చి కుక్కలా మారి కరుస్తున్నారు. అలాంటి కుక్కను తరిమి తరిమి రాళ్లతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ ఇసుక దోపిడీకి, ధన దాహానికి దళిత బిడ్డ అడ్డుకుంటే.. వారిపై దాడులు చేయించాడు. ఓట్లేసిన సిరిసిల్ల ప్రజలను పోలీసుల బూట్లకింద కేటీఆర్ నలిపేస్తున్నాడు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించిన మీరాకుమారి గారిని అవమానించిన దుర్మార్గుడు కేసీఆర్. నేరేళ్లలో దళితుల దాడుల సందర్భంగా ఎస్సీ కమిషన్ నివేదిక గురించి బండి సంజయ్ మాట్లాడిండు. ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు? బండి సంజయ్ ఎవరికి లొంగిపోయాడు? నివేదికను బయటపెట్టి దళితులపై దాడిచేసిన వారిని ఎందుకు శిక్షించడంలేదు. నెరేళ్ల దళితుల దాడులపై ఎప్పటిలోగా నివేదిక బయట పెడతావ్..? ఎప్పటిలోగా దళితులపై దాడులు చేసిన వారిని శిక్షిస్తారో బండి సంజయ్ చెప్పాలి. కూలీ డబ్బులు తప్ప ప్రభుత్వం తమకు చేసిందేం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం సిరిసిల్ల నేతన్నలను ఎందుకు అడుకోవడంలేదు? ఈ సిరిసిల్లకు పట్టిన కొరివి దయ్యాన్ని వదిలించండి" అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి

"నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు అని డ్రామారావు అంటున్నారు. మరీ అదే నిజమైతే..10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్ కు పేదలను ఎందుకు రానివ్వడం లేదు? 1200 మంది అమరవీరుల కుటుంబాలలో ఏ ఒక్కరికైనా ఇంటికి పిలిచి బుక్కెడు బువ్వ పెట్టారా? మన కుటుంబం సభ్యుడు ఎలా అయితడు. కేటీఆర్ తెలంగాణ కుటుంబ సభ్యుడు కాదు.. దండుపాళ్యం ముఠా సభ్యుడు మాత్రమే. పోలీసుల పహారా మధ్య ప్రగతి భవన్... పాకిస్తాన్ ఇండియా బార్డర్ ను తలపిస్తోంది. అమరుల కుటుంబాలను ప్రగతి భవన్ కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదు. నువ్వు తెలంగాణ కుటుంబం ఎట్లా అయితవ్ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలకు తరమాలి. ఉద్యమకారులంతా ఆస్తులు పోగొట్టుకుంటే.. కేటీఆర్ కు ఇన్ని కోట్ల ఆస్తులేలా వచ్చాయి? నువ్వు ఉద్యమకారుడివా? పేద బిడ్డలు ప్రగతి భవన్ కు వచ్చేలా ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టు. అప్పుడే నువ్ తెలంగాణ కుటుంబ సభ్యుడివని నమ్ముతాం. చింతమడక నుంచి వచ్చిన కేటీఆర్ ఎప్పటికీ మీ బిడ్డ కాదు. నాలుగు కోట్ల ప్రజలం మనం.. నలుగురు వాళ్లు. నమ్మితే ప్రాణాలు ఇచ్చే వాళ్లం మనం.. నమ్మితే గొంతు కోసే రకాలు వాళ్లు. అలాంటి వారిని తెలంగాణ పొలిమేరలదాకా తరమాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమివ్వండి" అని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.

కాలువ పనుల పరిశీలన

శ్రీపాద ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ కాలువ పనులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. కాలువ పనులు పూర్తి చేయకపోవడానికి గల కారణాలపై అధికారులను ఫోన్ ద్వారా ప్రశ్నించిచారు. పనులు ఆలస్యం చేయడం ద్వారా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంటుందని, కాబట్టి పనుల్లో జాప్యం తగదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులు సరిగా చేయడం లేదన్న నెపంతో కేటీఆర్ తన మనుషులకు ఈ ప్రాజెక్ట్ పనులు అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాలువ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచారని చెప్పారు. కడప జిల్లా వారికి కాంట్రాక్టు అప్పగించారని.. లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని ఆరోపించారు.

ఇవాళ వేములవాడలో యాత్ర...

ఇక రేవంత్ రెడ్డి ఇవాళ్టితో పాదయాత్ర 21వరోజుకి చేరింది. ఈరోజు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనం తర్వాత కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ కు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటలకు రుద్రారం మండలం సంకెపల్లిలోని క్యాంపు వద్ద లంచ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు సంకెపల్లి నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. అనుపురం, నాంపల్లి స్టేజి, కోడుముంజ (షభష్ పల్లి), చింతల్ తాణా, రెడ్డి కాలనీ, రాజీవ్ చౌక్ మీదుగా వేములవాడకు చేరుకోనుంది. రాత్రి 7 గంటలకు వేములవాడలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలం పుదూర్ లో రాత్రి బస చేస్తారు.

తదుపరి వ్యాసం