Revanth Reddy Padayatra : పోడు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు.... రేవంత్ రెడ్డి
Revanth Reddy Padayatra : రాష్ట్రంలో అర్హులైన పోడు రైతులకి భూమి పట్టాలు ఇచ్చే వరకు.. కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ ని మించిన వారు లేరని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా ఇల్లందు సభలో మాట్లాడిన రేవంత్.. కొన్ని నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Revanth Reddy Padayatra : 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్.... పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మరోసారి పోడు రైతులకి భూమి హక్కుల పేరిట డ్రామాలకు తెరలేపారని ... ఇందుకు అసెంబ్లీనే వేదికగా చేసుకున్నారని విమర్శించారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లందు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పోడు భూముల హక్కులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.... నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరని ఆరోపించారు. 11.50 లక్షల ఎకరాలను పోడు రైతులకి పంచే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సభలకు వెళితే పోడు భూముల పట్టాలు రావని గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... పోడు భూముల పట్టాలు ఎలా రావో చూస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే... వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే బీఆర్ఎస్ నేతలను చెట్లకు కట్టేసి .. పట్టాలు ఇచ్చిన తర్వాతనే విడిచిపెడతామని చెప్పే చైతన్యం పోడు రైతుల్లో వస్తుందని అన్నారు. 9 ఏళ్లయినా... గిరిజన రిజర్వేషన్ల పెంపు... వాల్మీకి బోయ, ఖాయితీ లంబాడ తదితర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని పేర్కొన్నారు. ఉన్న గిరిజనులకే 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వని కేసీఆర్.... కొత్తగా మరో 11 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మరో మోసాన్ని మొదలు పెట్టారని రేవంత్ విమర్శించారు.
బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు కట్టలేదని సీఎం కేసీఆర్ ని నిలదీశారు రేవంత్. ఫ్యాక్టరీ కట్టి ఉంటే... 30 వేల మంది స్థానికులకి ఉద్యోగ అవకాశాలు దక్కేవని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని... వాస్తవంగా మాత్రం క్షేత్రస్థాయిలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సబ్ స్టేషన్లను ముట్టడిస్తుంటే... ఆ విషయం కేసీఆర్ కి తెలియడం లేదా అని నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు.. రైతు రుణమాఫీ.. ఫీజు రీయంబర్స్ మెంట్.. పథకాలకు నిధులు విడుదల చేయకుండా పేదలు, రైతులు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ పథకం సరిగ్గా అమలు కావడం లేదని చెప్పారు.
సమ్మక్క - సారక్క ఆశీర్వాదంతో... వచ్చే సంవత్సరం జనవరిలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని.. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు.. సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని.... బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు ఎంత ఉన్నా.. పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. రైతులకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని... పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లిస్తామని తెలిపారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ బకాయిలన్నింటినీ చెల్లించి... పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ... కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని... ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని రేవంత్ సూచించారు.