YS Sharmila : పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్, కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా ?-ysrtp president sharmila challenges kcr and ktr on pending projects in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ysrtp President Sharmila Challenges Kcr And Ktr On Pending Projects In Telangana

YS Sharmila : పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్, కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా ?

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 07:33 PM IST

YS Sharmila : రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా.. నీళ్ల కష్టాలు తీరయాని చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నడిచే మోటార్లకు కట్టే కరెంట్ బిల్లుల మందం కేటాయించినా.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల (twitter)

YS Sharmila : రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై .. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు పూర్తి చేశామని.. నీళ్ల కష్టాలు లేవంటూ కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారని.. రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు చేసి కేవలం 57 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో ఇతర పెండింగ్ ప్రాజెక్టులని ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ 33 ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు చేశారన్న షర్మిల... 2016-17 నాటికే ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసే విధంగా పనులు సైతం జరిగాయన్నారు. అలీసాగర్, గుత్నా, గడ్డెన్న సుద్దవాగు లాంటి ప్రాజెక్టులను 2007 వరకే పూర్తి చేశారని గుర్తు చేశారు. దేవాదులు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు 70 శాతం.. మిగిలిన వాటిలో 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.

2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం... ఆ తర్వాత 2014 లో అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... పెండింగ్ ప్రాజెక్టులని పట్టించుకున్నది లేదన్నారు షర్మిల. కేవలం రూ.8,500 కోట్లు ఖర్చు చేస్తే.. 16 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని 2015లో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారని... 35 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చంటూ వేదాలు వల్లించారని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులకి ఇంకొన్ని నిధులు కేటాయిస్తే మిగిలిన పనులు కూడా పూర్తయ్యేవని.. కానీ కేసీఆర్ వాటిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని బూటకపు మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రజా క్షేత్రంలో బహిరంగ చర్చకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నడిచే మోటార్లకు కట్టే కరెంట్ బిల్లుల మందం కేటాయించినా.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు షర్మిల. తద్వారా 30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని అన్నారు.

ఈ సందర్బంగా.. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు షర్మిల. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు... నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, బ్రాహ్మణ వెల్లేముల, ఉదయసముద్రం, అడవిదేవులపల్లి, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం... పాలమూరు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా ఫేజ్ 1, 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, భూత్పూర్... ఆదిలాబాద్ లోని చనాకకొరాట, జగన్నాథపురం, కొమురంభీం, వార్థా, కుఫ్టీ, చెన్నూరు లిఫ్ట్, గూడెం లిఫ్ట్, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులు... నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 22, లెండి ప్రాజెక్టులు... కరీంనగర్ జిల్లాలో ప్యాకేజీ 9, సూరమ్మ చెరువు, రోళ్లవాగు... వరంగల్ జిల్లాలో దేవాదుల, చిన్న కాళేశ్వరం, గుండవాగు, ఆకేరువాగు, పాలెంవాగు, పాలకుర్తి, చెన్నూరు, మోడికుంట.... మెదక్ జిల్లాలో సింగూరు కాలువల ఆధునీకరణ, ఘనపూర్, ఆనకట్ట ఎత్తు పెంపు ... తదితర ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

మరోవైపు... షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరణపై ఇవాళ (ఫిబ్రవరి 28న) హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్ర, సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని షర్మిల తరపు న్యాయవాది కోరారు. షర్మిల కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది... అనుచిత వ్యాఖ్యలు చేయొద్దనే గత ఆదేశాలను షర్మిల పాటించలేదన్నారు. ఎమ్మెల్యేలపై ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను జడ్జికి చూపించారు. దీంతో.... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబోనని అఫిడవిట్ సమర్పించాలని షర్మిలను ఆదేశించిన హైకోర్టు... విచారణను మార్చి 3కి వాయిదా వేసింది.

IPL_Entry_Point