Revanth Reddy : బిల్లా రంగా ల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... రేవంత్ రెడ్డి-brs mlas looting public properties alleges revanth reddy in hanumakonda meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Brs Mlas Looting Public Properties Alleges Revanth Reddy In Hanumakonda Meeting

Revanth Reddy : బిల్లా రంగా ల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Feb 20, 2023 10:14 PM IST

Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. 12వ రోజు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ఆయన... హన్మకొండ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా... సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాగా మారారని.. వారికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిల్లా రంగాల్లా ప్రజలను దోచుకుంటున్నారని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, యువకులు, ఉద్యోగులు... ఇలా ఏ ఒక్కరూ కేసీఆర్ పాలనలో సంతోషంగా లేరని అన్నారు. కేసీఆర్ 9 ఏళ్ల పరిపాలనలో... ఉద్యోగాల కోసం 3 వేల మంది యువకులు... అప్పులు భారమై 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు బీమా లెక్కల ప్రకారమే... 2018 నుంచి 2022 వరకు 80 వేల మంది రైతులు చనిపోయారని చెప్పారు. రెండు రోజుల విరామం తర్వాత పాదయాత్రను తిరిగి ప్రారంభించిన రేవంత్ రెడ్డి... హన్మకొండ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీనియర్ నేత వీహెచ్, నాయని రాజేందర్ రెడ్డి, బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..... ఓరుగల్లు నివురుగప్పిన నిప్పులా ఉందని.. ఏనుమాముల మార్కెట్ దళారుల పాలు అయిందని రైతులు తమ గోడు వినిపించారని చెప్పారు. బీఆరెస్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా భూములు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందా ? అని ప్రశ్నించిన ఆయన... రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఏకశిల పార్కు తాగుబోతుల అడ్డాగా మారిందని.. కాళోజి కళా క్షేత్రం మొండిగోడలతో నిలబడిందన్నారు. కేసీఆర్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని నిలదీశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వలేదన్నారు. తొమ్మిదేళ్లయినా అమరుల స్థూపం... అంబేద్కర్ విగ్రహం... కాళోజీ కళా క్షేత్రం పూర్తి కాలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ హామీలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉన్నాయని... కానీ ఏ ఒక్కటీ నేరవేర్చలేదని రేవంత్ ఫైర్ అయ్యారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాగా తయారయ్యారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములు, ఆస్తులని దోచుకుంటున్నారని ఆరోపించారు. హన్మకొండ సాక్షిగా వారికి హెచ్చరిక చేస్తున్నానని... రోజులు లెక్కపెట్టుకోండని అన్నారు. దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయని.. అధికారులు నిబంధనలకు లోబడి పనిచేయాలని రేవంత్ హితవు పలికారు. సర్కార్ పెద్దల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘిస్తే.. రేపటి నాడు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదేనని హెచ్చరించారు. అలాంటి వారిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉద్యోగులకి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలు ఎంతో గౌరవ, మర్యాదలతో ఉండేవని.. ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటో ఆలోచన చేయాలని అన్నారు.

పార్టీ కోసం కష్టపడేవారికి చేయాల్సిన సమయంలో చేయాల్సినవన్నీ సోనియమ్మ చేస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలను ఆదుకునే కార్యాచరణ తాము తీసుకుంటామన్నారు. సోనియమ్మ బొమ్మతో ఏ కాంగ్రెస్ కార్యకర్త నిలబడ్డా.. గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత తనదన్నారు. 2024, జనవరిలో మొదటి వారంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని... వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

IPL_Entry_Point