KCR in Assembly : ఈటల రాజేందర్ తో మాట్లాడండి... మంత్రులకి కేసీఆర్ ఆదేశం.. !-cm kcr slams pm modi and bjp orders ministers to discuss with mla eetela rajender on diet charges hike ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Slams Pm Modi And Bjp Orders Ministers To Discuss With Mla Eetela Rajender On Diet Charges Hike

KCR in Assembly : ఈటల రాజేందర్ తో మాట్లాడండి... మంత్రులకి కేసీఆర్ ఆదేశం.. !

HT Telugu Desk HT Telugu
Feb 12, 2023 06:55 PM IST

KCR in Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తిర సన్నివేశం చోటుచేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానం ఇచ్చిన కేసీఆర్ ... ప్రసంగంలో పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించారు. డైట్ చార్జీలు పెంచుతామని... ఈ అంశంపై మంత్రులు ఈటలతో కూడా మాట్లాడాలని చెప్పారు. కేంద్రంలోని మోదీ సర్కార్... రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్న సీఎం... కేంద్రం తీరుతో రాష్ట్రం రూ. 3 లక్షల కోట్లు కోల్పోయిందని చెప్పారు. అదాని విషయంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2024 తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు కేసీఆర్.

ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్

KCR in Assembly : 2024 తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉందని... కానీ అలా జరగడం లేదని అన్నారు. ప్రధాని మోదీకి వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలతో సరిపెడుతున్నారని... వాటికి ఆయన మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. అన్నీ తెలిసే సమయానికి మోదీ మాజీ ప్రధాని అయిపోతారని సెటైర్ వేశారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానం ఇచ్చిన సీఎం కేసీఆర్.... కేంద్రంలోని మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని... 150 నర్సింగ్‌ కాలేజీలు కేటాయిస్తే రాష్ట్రానికి ఒక్కటీ రాలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం... తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణకు సొమ్ములు ఇప్పించడంలో ఏడేళ్లుగా జాప్యం జరుగుతోందన్న కేసీఆర్... ఏమీ చేయం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని తెలిపారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీలో అదే తరహాలోనే మాట్లాడారని కేసీఆర్ గుర్తు చేశారు.

దేశరాజధాని ఢిల్లీలోనూ తాగునీటికి దిక్కులేదన్న కేసీఆర్... రత్నగర్భం లాంటి దేశంలో కనీస అవసరాలు తీరడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో గ్రీన్‌కార్డు వస్తే పండుగ చేసుకునే పరిస్థితి నెలకొందని... కానీ మన దేశంలో 8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారని చెప్పారు. దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారని.. ప్రజలు ఓడుతున్నారని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి అని... పని ఎక్కువ .. ప్రచారం తక్కువ అని పేర్కొన్న కేసీఆర్... మోదీ కంటే మన్మోహన్ ఎక్కువ మంచి పనులు చేశారని వ్యాఖ్యానించారు. మన్మోహన్‌, మోదీ పాలనపై పూజామెహ్రా 'ద లాస్ట్‌ డెకేడ్‌' పుస్తకం రాశారని... మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నదని విమర్శించారు.

ఇటీవల పార్లమెంటులో మాట్లాడిన ప్రధాని మోదీ.... తన ప్రసంగంలో అదానీ ప్రస్తావనే తీసుకురాలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. అదానీ.. తెలంగాణలోనూ కంపెనీ పెడతామన్నారని.. కానీ పెట్టలేదని.. అందుకు మనం బతికిపోయామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరా పాలనను విమర్శిస్తున్న మోదీ... అదానీ విషయం చెప్పకుండా ఏవేవో ప్రసంగించారని వ్యాఖ్యానించారు. అదానీ ఆస్తుల అసలు విలువపై ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త అశ్వత్థ దామోదర్‌ కూడా చెప్పారన్నారు.. కేసీఆర్. గోద్రా అలర్లపై బీబీసీ కథనాన్ని నిషేధించారని... బీబీసీని నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో కేసులు వేశారని... ఇది ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని... మోదీ సర్కారు హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి రేటు ఉందా అని నిలదీశారు.

మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.73 శాతంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 7.1 శాతానికే పరిమితమైందని చెప్పారు. అప్పు చేయడంలో మోదీని మించిన ప్రధాని లేరని... జీడీపీలో అప్పుల శాతం మోదీ హయాంలో పెరిగిందని .. ఇది ఎవరూ కాదనలేని సత్యమన్నారు. మన్మోహన్ హయాంలో జీడీపీలో అప్పుల శాతం 52.2 గా ఉంటే.. మోదీ హయాంలో 56.2 శాతానికి పెరిగిందని వివరించారు. మూలధన వ్యయం మన్మోహన్‌ హయాంలో 37 శాతం కాగా... మోదీ హయాంలో 31 శాతం లోపే ఉందని వివరించారు. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77 గా ఉంటే.. మోదీ హయాంలో 5.1 శాతానికి పెరిగిందని చెప్పారు. గతంలో పారిశ్రామిక వృద్ధిరేటు 5.87 శాతం కాగా.. మోదీ హయాంలో 3.27 శాతానికి పడిపోయిందని అన్నారు. మేకిన్ ఇండియా, విశ్వగురు ఎటుపోయాయని ప్రశ్నించారు. మన్మోహన్ కాలంలో రూపాయి విలువ 58.6 అయితే.. మోదీ హయాంలో 82.6 కి చేరిందని చెప్పారు. తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్క మాట అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. భారత్‌.. 5 ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారని... కానీ అది చాలా తక్కువ అని పేర్కొన్నారు. తలసరి ఆదాయ సూచీనే అసలు అభివృద్ధి అని... తలసరి ఆదాయంలో భారత్‌ ర్యాంకు 139గా ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌, భూటాన్, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువగా ఉందని అన్నారు.

దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయేనని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో లైసెన్స్‌ రాజ్‌ నడిస్తే.. మోదీ హయాంలో సైలెన్స్‌ రాజ్‌నడుస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి మోదీ ఫోటో కోసం రేషన్‌ డీలర్‌తో కొట్లాడతారా ? అని ప్రశ్నించారు. ఏం సాధించారని మోదీ ఫోటో పెట్టుకోవాలని నిలదీశారు. ఒక్క మెడికల్‌ కాలేజ్‌ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి అని ప్రశ్నించారు. కేంద్రం తీరుతో రాష్ట్రం రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందని చెప్పారు. నోట్ల రద్దు సమయంలో తాను మోదీని సమర్థించానని.. కానీ తాను చెప్పింది వేరు.. మోదీ చేసింది వేరని కేసీఆర్ అన్నారు. గతంలోనూ ఎన్నో కొత్త రైళ్లు వచ్చినా.. వాటిని ప్రధానులు ప్రారంభించలేదన్న కేసీఆర్.... ఒకే ఒక్క వందేభారత్‌ రైలును మోదీ ఇప్పటికి 14 సార్లు ప్రారంభించారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని అడిగారు. 1871 నుంచి 140 ఏళ్లలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదని... జనాభా లెక్కలు జరిగితే బండారం బయటపడుతుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

మన దేశంలో చాలినంత నాణ్యమైన బొగ్గు ఉందని... వ్యాపార స్నేహితుల కోసం రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి విదేశీ బొగ్గు కొనిపిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రిడ్‌ మెయింటెనెన్స్‌లో భాగంగానే ఒకటి, రెండు చోట్ల సరఫరాలో సమస్య వచ్చిందని... రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై చర్చించి పరిష్కరించామని చెప్పారు. ఎంత ఖర్చయినా సరే.. ఇకపై ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ పోనీయమని స్పష్టం చేశారు. 16 వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా సమస్య లేకుండా విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. దమ్మున్న ప్రధాని ఉంటే.. 24 గంటల విద్యుత్‌ ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ ప్రశ్నించారు.

కాళేశ్వరం, పాలమూరుపై ఎన్ని కుట్రలు చేశారో ఈటల రాజేందర్‌కు తెలియదా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. కుట్రలన్నీ ఛేదించి అనేక ప్రాజెక్టులు సాధించుకున్నామని... సాగులో పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి ఎదిగామని చెప్పారు. నీళ్ల లెక్కలు తేల్చడం కాంగ్రెస్, బీజేపీ వల్ల కాలేదని.... అందుకే బీఆర్ఎస్ తెచ్చామని పేర్కొన్నారు. వాక్సుద్ధి, చిత్తశుద్ధి,సంకల్ప శుద్ధి ఉంటే.. తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పారు. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని... కొత్త జల విధానం తీసుకొస్తామని అన్నారు. ఐదారేళ్లలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తరహాలో తాగునీరు ఇస్తామని చెప్పారు. కాకతీయ కాలువ, కూడవెళ్లి, హల్ది, మంజీరాలోనూ నీళ్లు వదిలామని... వాగుల్లో నీళ్లు పారినట్టే.. మాకు ఎన్నికల డబ్బాల్లో ఓట్లు పారతాయని కేసీఆర్ అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రులని ఆదేశించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా... డైట్ చార్జీల విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రస్తావించారు. ప్రస్తుత చార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదని.. వాటిని పెంచాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందించిన కేసీఆర్... ఈటల రాజేందర్ పెంచమని అడిగారు కాబట్టి... పెంచకుండా ఉండమని అన్నారు. ఛార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రులను ఆదేశించిన ఆయన... చార్జీలు పెంచేటప్పుడు ఈటల రాజేందర్ కు కూడా ఫోన్ చేసి మాట్లాడాలని సూచించారు. ఈటల రాజేందర్‌ ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తామని... సమస్యలు ఎవరు చెప్పినా సానుకూలంగా స్పందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

IPL_Entry_Point