KTR : ద్రోహులకు దేశభక్తే ఆఖరి రక్ష... కేటీఆర్ ట్వీట్ !
KTR : కేంద్రంలోని బీజేపీ మంత్రులపై మంత్రి కేటీఆర్ పరోక్ష విమర్శలు చేశారు. జార్జి సారోస్ వ్యాఖ్యలు దేశంలో రచ్చ రేపుతున్న వేళ.. కేంద్ర మంత్రులు ఆ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. అదానీ కుంభకోణం, హిండెన్ బర్గ్ నివేదికపై స్పందించని వారు... సారోస్ వాఖ్యలపై మాత్రం ఉలిక్కిపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR : కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ప్రధాని మోదీపై యూరప్ కు చెందిన బడా పెట్టుబడిదారు జార్జి సారోస్ చేసిన వ్యాఖ్యలు... రచ్చ రేపుతున్నాయి. హిండెన్ బర్గ్ నివేదికతో.. అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ప్రకంపనలు పుట్టి.. షేర్ మార్కెట్లు అతలాకుతలమవగా... ఈ అంశంపై అన్ని వైపుల నుంచి మోదీ సర్కార్ అనేక ప్రశ్నలు ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో... జార్జి సారోస్ చేసిన వ్యాఖ్యలు, దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ భవిత అదానీతో ముడిపడి ఉందని... అదానీ దెబ్బతినడంతో మోదీకి కూడా కష్టాలు మొదలైనట్లేనంటూ సారోస్ చేసిన వ్యాఖ్యలపై... బీజేపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సారోస్ మాటలను దేశ ప్రజాస్వామ్యంపై యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. సారోస్ మూర్ఖపు అభిప్రాయాలు గల వ్యక్తి అని విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో... కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అదానీ కుంభకోణం.. హిండెన్ బర్గ్ నివేదిక పై తమ వైఖరి స్పష్టం చేయాలని దేశం నలుమూలల నుంచి వస్తోన్న ప్రశ్నల గురించి... కనీస ప్రస్తావన చేసే దమ్ము లేదుగానీ.... అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన కామెంట్స్‌పై మాత్రం ఉలిక్కి పడుతున్నారంటూ బీజేపీ నేతలకు కౌంటర్ వేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
"అదానీ కుంభకోణం.. హిండెన్ బర్గ్ నివేదిక గురించి కనీసం ప్రస్తావించే దమ్ము లేదు. కానీ, బిలియనీర్ జార్జ్ సోరోస్ కామెంట్స్ చేయగానే.. వారి గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం.. ! ఎంతకు దిగజారి వ్యవహరిస్తున్నారు" అని మంత్రి ట్విటర్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అదే విధంగా.... "ఈ వ్యాఖ్యలు ఎవరి గురించో చెప్పుకోండి..?" అంటూ తన ట్విటర్ ఫాలోవర్‌లకు ప్రశ్న కూడా వేశారు. "patriotism is the last refuge of the scoundrel(ద్రోహులకు దేశభక్తే ఆఖరి రక్ష)" అన్న సామ్యేల్ జాన్సన్ కొటేషన్ ను... ట్వీట్ కి జత చేశారు.
మరోవైపు... తెలంగాణలో "అంటు వ్యాధులు.. పాండమిక్ సన్నద్ధత" కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని సీరం ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ఈ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇటీవల దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా.. తెలంగాణలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సీరం సంస్థ ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఆదివారం మంత్రి కేటీఆర్, సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా... వర్చువల్ గా సమావేశమయ్యారు. అనంతరం... సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీరం సంస్థ ప్రకటించింది.
టాపిక్