Vemulawada: యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి.... కేటీఆర్-vemulawada to be developed like yadadri says minister ktr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada: యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి.... కేటీఆర్

Vemulawada: యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి.... కేటీఆర్

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 04:42 PM IST

Vemulawada: శివరాత్రి ఉత్సవాలకు వేములవాడ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులని ఆదేశించారు. జాతరకు అవసరమైన సౌకర్యాల కల్పనకు అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. వేములవాడ క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం
వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం (facebook)

Vemulawada: భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధిపైన మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. ఈ శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం తో పాటు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని తెలిపిన మంత్రి... ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణం మొత్తంలో పారిశుద్ధ్య నిర్వహణ పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముందస్తు జాగ్రత్తగా అదనపు అంబులెన్సులు... ఫైర్ అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. జాతరకు అవసరమైన సౌకర్యాల కల్పనకు అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్, ఇందుకోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

వేములవాడ గుడి చెరువు బండ్ (Bund) ను వరంగల్ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిలువనున్నాయన్న ఆయన... ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణం,అడ్వెంచర్ గేమ్స్ అలాగే వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయానికి వచ్చే పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులలో ఫుట్ పాత్ లను నిర్మించాలని ఆదేశించారు. అవకాశం ఉన్న ప్రతి చోట వాల్ పెయింటింగ్ ఆర్ట్ ను ఉపయోగించుకొని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మూల వాగుకు ఆనుకుని ఉన్న బండ్ ను సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ గా మారుస్తామన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల నీటి నిర్వహణతో పాటు, వాటి పరిసర ప్రాంతాలను అందమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దెందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాజన్న ఆలయానికి అనుసంధానంగా ఉన్న సంస్కృత పాఠశాలకు అనుబంధంగా నృత్య పాఠశాల, సంగీత పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు వాటికి ప్రత్యేకంగా భవన నిర్మాణాలు చేపడతామన్నారు... కేటీఆర్. అత్యున్నత ప్రమాణాలతో వేములవాడ యువత కోసం మినీ స్టేడియం నిర్మాణం తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లైన్లు రహదారి నిర్మాణం, నాంపల్లి గుట్టపై రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో వేములవాడ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు తో పాటు, ఆర్ అండ్ బి, శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహజన్, వేములవాడ ఆలయ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Whats_app_banner