తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Padayatra: కరీంనగర్ గడ్డకు బండి సంజయ్ ఏమైనా చేశాడా..?

Revanth reddy Padayatra: కరీంనగర్ గడ్డకు బండి సంజయ్ ఏమైనా చేశాడా..?

HT Telugu Desk HT Telugu

02 March 2023, 22:01 IST

google News
    • revanth reddy padayatra in husnabad: హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హుస్నాబాద్ లో పాదయాత్ర సందర్భంగా... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ఏమైనా చేశాడా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని… ఇందిరమ్మ రాజ్యం తేవాలని ప్రజలను కోరారు. ఇక రేవంత్ పాదయాత్రలో ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు.
పాదయాత్రలో రేవంత్ రెడ్డి
పాదయాత్రలో రేవంత్ రెడ్డి

పాదయాత్రలో రేవంత్ రెడ్డి

Revanth reddy Padayatra Updates: రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. యాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2004లో సోనియా గాంధీ కరీంనగర్ గడ్డ మీద తెలంగాణను సాకారం చేస్తా అనే ప్రకటించారని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరిగిన మాట ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీ తెలంగాణ కలను సాకారం చేశారని స్పష్టం చేశారు. కేసీఆర్, వినోద్ ఎంపీలు అయిన తెలంగాణ రాలేదని... పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీ అయి తెలంగాణ తెచ్చారని వ్యాఖ్యానించారు.

"తెలంగాణ అభివృద్ధి కోసం బయ్యారం ఉక్కు కార్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ఏమైనా చేశాడా. ఈ విషయంలో పొన్నంతో చర్చకు సిద్ధమా...? బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ని అమిత్ షా పిలిపించుకొని మూడుగంటలు కూర్చోబెట్టి ముచ్చట చెప్పిండి... తప్ప చేసిందేం లేదు. ఫిరాయింపులతో తెలంగాణలో బీజేపీ విజయం సాధించలేదు. సర్దార్ సర్వాయి పాపన్న వారసులు ఈ గడ్డ మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 45 లక్షల బడ్జెట్లో ఒక్క రూపాయి అయిన తెలంగాణకు మోదీ ఇచ్చారా..? మోదీ 9 ఏళ్లలో రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేయరు. అదానీ, అంబానీలకు రూ. 12 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మోదీ. ఆ లెక్కన తెలంగాణలో మోదీ 70లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. అదే జరిగితే తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావు. 21 కోట్ల దరఖాస్తులు వస్తే..7లక్షల 164 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో నిస్సిగ్గుగా చెప్పారు. బండి సంజయ్ గెలిచి బీజేపీకి అధ్యక్షుడు అయ్యాడు. తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదు. ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ రావొద్దు" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గౌరెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కుర్చీ వేసుకొని గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేసాడని కేసీఆర్ ను దుయ్యబట్టారు. "మీకు ఇష్టం లేకున్నా మీ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు. ఇంత అన్యాయం ఉంటుందా...? హరీష్ రావు నీవు చేసిన ఈ పాపానికి సతీష్ బాబుకు డిపాజిట్ దక్కదు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఎవరికి దక్కదు. కానీ సతీష్ బాబు ఇంటికే కేసీఆర్ వస్తారు. కేసీఆర్ దగ్గర మీ సమస్యల గురించి ప్రస్తావించని సతీష్ బాబు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం లేదు. హుస్నాబాద్ అభివృద్ధి చెందాలన్నా, మీ నియోజకవర్గాన్ని కరీంనగర్ లో కలపాలన్నా హుస్నాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. మనమిచ్చిన బలంతోనే కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. కేసీఆర్ మారడు. మనమే కేసీఆర్ మార్చాలి. మిడ్ మానేరు భూములు కొల్పోయిన కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్ రావు, ఆయన చెల్లెలకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. కేసీఆర్ సడ్డకుడి కొడుకు, కూతురుకు ఒక న్యాయం, గండిపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక న్యాయమా...? ఎంత కాలం ఈ దౌర్భగ్యాన్ని భరిద్దాం. 2004-14 మధ్య ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దింది. కొత్త సంవత్సరంలో 2024 జనవరి 1 న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది" అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ప్రతీ పేదోడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలకు ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని... పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. సోనియామ్మ ఆశ్వీరాదంతో ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పుకొచ్చారు. ఏడాదిలోగా ప్రభుత్వంలో ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నీ మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని... ఇందిరమ్మ రాజ్యం తేవాలని ప్రజలను కోరారు.

తదుపరి వ్యాసం