బండి సంజయ్ స్థానంలో రానున్నదెవరు? అమిత్ షా మీటింగ్ ఎందుకోసం?
మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే మార్చి నెలలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదవీ కాలం పూర్తవుతోంది. ఈనేపథ్యంలో నేడు ఢిల్లీలో అమిత్ షాతో రాష్ట్ర నేతల సమావేశం ఉంది.
న్యూఢిల్లీ: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యూహాలను రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం దేశ రాజధానిలోని తన నివాసంలో రాష్ట్ర నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ ఉన్నత వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ బండి, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, సీనియర్ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఇతర తెలంగాణ బీజేపీ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ సన్నద్ధమైంది.
ప్రజా గోస - బీజేపీ భరోసా, ప్రజా సంగ్రామం యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడానికి, క్షేత్ర స్థాయికి చేరుకోవడానికి పార్టీ ప్రయత్నించింది. ఆయా యాత్రల ద్వారా పార్టీకి ప్రజల నుండి భారీ సానుకూల స్పందన లభిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బూత్ స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై తాజా సమావేశంలో చర్చించనున్నారు.
బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు 11,000 బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.
బీజేపీ అధ్యక్షుడు సంజయ్ బండి పదవీకాలం మార్చి మొదటి వారంలో ముగియనున్నందున త్వరలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే పార్టీ అధ్యక్షుడిగా అతని పదవీకాలం పొడిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంతకుముందు జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసంగ్రామ యాత్రను ప్రశంసించడంతో పాటు సంజయ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అతని ప్రయాణం నుండి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలని చెబుతూ అతని పోరాటం, కృషిని ప్రశంసించారు.
బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోగలమనే స్థాయికి చేర్చి వారిలో విశ్వాసాన్ని నెలకొల్పారన్న పేరుంది. అయితే కేంద్రం వల్ల రాష్ట్రానికి జరిగిన మేలును ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణకు చేసే మేలుపై హామీ ఇవ్వలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన చట్టబద్ధమైన హామీలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తుంగలో తొక్కిందన్న విమర్శలు ఉన్నాయి.