CM KCR Banswada Tour: నిజాంసాగర్ ఎండిపోయే ప్రశ్న రానేరాదు - సీఎం కేసీఆర్
CM KCR Latest News: బాన్సువాడ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లను ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందన్నారు.
CM KCR Banswada Tour: బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. బిర్కూర్ మండలంలోని ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కూడిన పైలాన్ ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
సమైక్య రాష్ట్రంలో సింగూరు నీళ్లు కోల్పోయామని... తెలంగాణ ఉద్యమం చేపట్టడానికిగల కారణాల్లో నిజాంసాగర్ నీళ్లు కూడా ఒకటని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఓనాడు ఇదే నీళ్ల కోసం టీడీపీలో ఉన్నప్పుడే సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా నిర్వహించారని గుర్తు చేశారు. ఆ రోజు తాను కూడా వచ్చి... సింగూరు నీళ్ల అంశంపై చర్చించానని చెప్పారు. సభాపతి పోచారం అందరికీ ఆత్మీయుడని, అన్ని తెలిసిన వ్యక్తని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉద్యమంలో భాగంగా పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తన నియోజకవర్గ అవసరాల కోసం పోచారం చిన్నపిల్లాడిలా కొట్లాడుతారని చెప్పారు. ప్రతి విషయంలోనూ బాన్సువాడ కోసం ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితంగా నిజాంసాగర్ ఎండిపోయే ప్రశ్న రానేరాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గతంలో తాను తిమ్మాపూర్‌కు వచ్చినప్పుడు వేంకటేశ్వస్వామి గుడి ఒక మాదిరిగా ఉండేదన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు గుడిచుట్టూ పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా మారిందని చెప్పారు. స్వామివారి కరుణ బాన్సువాడ మీద, యావత్ తెలంగాణ ప్రజానీకం మీద ఉండాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.వేంకటేశ్వర స్వామి గుడి బాగు కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో గుడిని మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
50 కోట్లు కేటాయింపు...
బాన్సువాడకు తీపి కబురు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు.నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందడం కోసం సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తున్నానని ప్రకటించారు. ఈ ఏడాది ఒక్క బాన్సువాడ ఏరియాలోనే రైతులు రూ.1500 కోట్ల పంట పండిస్తున్నారని స్థానికుల ద్వారా తెలిసిందని తెలిపారు. పోచారం నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. పోచారం వయసు పెరుగుతోందన్న సీఎం కేసీఆర్... అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సరదగా వ్యాఖ్యానిచారు. బాన్సువాడకు ఆయన ఇంకా సేవ చేయాల్సిందే అంటూ మాట్లాడారు.