Revanth Reddy : కాంగ్రెస్ చేసిన తప్పేంటి.. ? రేవంత్ రెడ్డి భావోద్వేగం !
17 February 2023, 23:28 IST
- Revanth Reddy : ఏం తప్పు చేసిందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని ఓడగొట్టారని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన తప్పా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలని కోరారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అని అంటే రెండు సార్లు గెలిపించారని.... అనేక సవాళ్లు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని అందించిన కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి... భావోద్వేగంగా మాట్లాడారు. ఏం తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారని.... తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన తప్పా ? అని రేవంత్ ప్రశ్నించారు. పదవుల కోసం కాదని.. ఆవేదనతో ఈ మాట అడుగుతున్నానని అన్నారు. ఇందరిమ్మ ఇళ్లు, టీచర్ల భర్తీ, రైతులకి ఉచిత కరెంట్, రుణమాఫీ, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, 108, సాగు నీటి ప్రాజెక్టలు... ఇలా అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు.
12 వందల మంది ఆత్మబలిదనాలు చూసి చలించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు రేవంత్. రాష్ట్రంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకూడదని.. ఏపీలో పూర్తిగా నష్టపోయినా వెనకడుగు వేయకుండా 4 కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు. అంత గొప్ప త్యాగం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉందా.. లేదా అని ప్రశ్నించారు. ఎండన పడి పోతే గుక్కెడు మంచినీళ్లు ఇచ్చినా.. తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని.. అంత గొప్ప గుణం ఉన్న ఇక్కడి ప్రజలు.. సోనియా గాంధీ చేసిన సాయాన్ని మర్చిపోయి మరోసారి కేసీఆర్ ని నమ్మితే.. సమాజం మనల్ని దోషిగా చూస్తుందా లేదా ఆలోచించుకోవాలని కోరారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ సమస్య అని... ప్రజలు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
స్టేషన్ ఘన్ పూర్ అంటే... కడియం శ్రీహరి, రాజయ్య గుర్తొస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులయ్యారని... స్టేషన్ ఘన్ పూర్ ని మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజయ్యపై అవినీతి ఆరోపణలు మోపి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని... ఇన్నేళ్లయినా ఆ అవినీతి ఏంటో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. సీఎం చేసింది అబద్ధపు ఆరోపణా లేక దోచుకున్న దాంట్లో రాజయ్య భాగం ఇచ్చారా అని నిలదీశారు.
"కేసీఆర్ నమ్మించి మోసం చేస్తారు. దళితులని మోసం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ చేయలేదు. ఇస్తానన్న ముఖ్యమంత్రి పదవి లేదు. ఇచ్చిన ఉపమఖ్యమంత్రి పదవి ఊడబీకిండు. ఇస్తా అన్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం లేదు. అందరికీ దళిత బంధు అని చెప్పి... ఇవాళ కొంత మందికే ఇస్తున్నారు. దళిత బంధు ఎంపికలో అధికార పార్టీ నేతలు కమీషన్లు కొల్లగొడుతున్నారు. రూ. 10 లక్షల్లో.. రూ. 3 లక్షల కమీషన్లు దోచుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దళితుల పాలిట రాబందులుగా మారారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ, వెలమ సామాజిక వర్గం వారే నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఒక్క ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఉన్న అర్హత ఏంటి ? కడియం శ్రీహరి దగ్గర ఓనమాలు నేర్చుకున్న ఎర్రబెల్లి దయాకర్ ను మంత్రిని చేశారు. కడియం శ్రీహరిని పక్కన పెట్టారు. ఇంత అవమానం కడియం శ్రీహరి కి అవసరమా ? ఎందుకు దొర దగ్గర బానిసలా ఉంటున్నారు ? కడియం శ్రీహరి ఆలోచన చేయాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న రేవంత్... 2024 జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని... ఆ వెంటనే ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని నిరుపేదలకు.. సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని.... బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు ఎంత ఉన్నా.. పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. రైతులకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని... పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లిస్తామని తెలిపారు. ప్రతి పేద రైతుకి ఏటా రూ. 15 వేల సాయం అందిస్తామన్నారు. రూ. 5 వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేసి.. ప్రతి పేద విద్యార్థికి ఆంక్షలు లేకుండా పూర్తి ఫీజు చెల్లిస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ బకాయిలన్నింటినీ చెల్లించి... పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల పరిమితిని.. రూ. 5 లక్షలకు పెంచుతామని రేవంత్ స్పష్టం చేశారు.