Telangana Budget 2023-24 : రూ. 6 వేల కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తవుతుంది ?.... విపక్షాలు-opposition parties slam telangana budget 2023 24 demands more allocations for runamafi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Opposition Parties Slam Telangana Budget 2023 - 24 Demands More Allocations For Runamafi

Telangana Budget 2023-24 : రూ. 6 వేల కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తవుతుంది ?.... విపక్షాలు

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 04:27 PM IST

Telangana Budget 2023-24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 -24 బడ్జెట్ ని.. అంకెల గారడీగా విపక్షాలు అభివర్ణించాయి. రూ. 6 వేల కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తవుతుందని.. కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నించాయి. గిరిజన బంధు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేకపోవడంపై నిలదీశాయి.

తెలంగాణ బడ్జెట్ 2023 -24
తెలంగాణ బడ్జెట్ 2023 -24

Telangana Budget 2023-24 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 -24 బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరిచాయి. బడ్జెట్ మొత్తం అంకెల గారడీ అని.. మాయ మాటలతో మరోసారి మభ్య పెట్టేందుకు భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని.. కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. బడ్జెట్ పూర్తిగా గతేడాది తరహాలోనే ఉందని.. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా కేటాయింపులు లేవని అసంతృప్తి వ్యక్తం చేశాయి. ముఖ్యంగా రైతురుణ మాఫీని ప్రభుత్వం విస్మరించిందని... మండిపడ్డాయి. ప్రభుత్వం తీరుతో.. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... కొత్త రుణాలు పొందలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరుద్యోగ భృతి ఊసెత్తకపోవడంపై సర్కార్ ని నిలదీశాయి.

ట్రెండింగ్ వార్తలు

బడ్జెట్ మొత్తం అంకెల గారడీ అని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నికల ఏడాది కావడంతో.. భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకోవడానికే.. ప్రభుత్వం రూ. 2.90 లక్షల కోట్లతో ఆర్థిక పద్దుని రూపొందించిందని ఆరోపించారు. లెక్కలు భారీగా ఉన్నా... కేటాయింపులు మాత్రం ఆశాజనకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీకి కేవలం రూ. 6,385 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. కనీసం రూ. 20 వేల కోట్లు కేటాయిస్తేనే రూ. లక్ష రుణ మాఫీ పూర్తవుతుందన్నారు. ప్రభుత్వం సకాలంలో రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు ఎన్పీఏలుగా మారిపోయాయని... తిరిగి వారు బ్యాంకుల్లో రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను 8 సంవత్సరాలుగా దారి మళ్లించిన ప్రభుత్వం.. ఈ సారి కూడా అలాగే చేసిందని ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో 50 శాతంగా ఉన్న బలహీన వర్గాలకు రూ. 6,229 కోట్లు మాత్రమే కేటాయించారని... ఆ నిధులు బీసీ సంక్షేమానికి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఉద్యోగులు పాత పెన్షన్ విధానం కోసం డిమాండ్ చేస్తున్నా... బడ్జెట్ లో మాత్రం ఆ ప్రస్తావనే లేదని చెప్పారు. గిరిజన బంధు, నిరుద్యోగ భృతి ఊసే లేదని... డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. మద్యానికి సంబంధించిన ఆదాయం మాత్రం ఘనంగా కనిపిస్తోందని భట్టి విమర్శించారు.

రూ. 2.90 లక్షల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం... ఉద్యోగులకు మాత్రం నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 70 శాతం కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదని... కొన్ని శాఖలకు రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. మరోసారి భారీ బడ్జెట్ పేరుతో ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెడుతోందని విమర్శించారు. నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటి వరకు రైతులకి రుణమాఫీ చేయలేదన్న ఈటల.. తాజా బడ్జెట్ లో కూడా పూర్తి రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... రుణమాఫీ పూర్తి చేస్తారా లేదా అనే అంశంపై ప్రభుత్వం రైతులకి స్పష్టమైన సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

IPL_Entry_Point