BRS vs Congress: సొంత ఇలాఖాపై రేవంత్ రెడ్డి ఫోకస్... వ్యూహం సిద్ధం చేసేశారా..? -kodangal politics is becoming interesting after revanth reddy meeting with gurunath reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Vs Congress: సొంత ఇలాఖాపై రేవంత్ రెడ్డి ఫోకస్... వ్యూహం సిద్ధం చేసేశారా..?

BRS vs Congress: సొంత ఇలాఖాపై రేవంత్ రెడ్డి ఫోకస్... వ్యూహం సిద్ధం చేసేశారా..?

Mahendra Maheshwaram HT Telugu
Jan 29, 2023 09:33 AM IST

telangana assembly election 2023: కొడంగల్ పాలిటిక్స్ హీట్ ను పెంచుతున్నాయి. ఎన్నికల ఏడాది కావటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచే పనిలో పడ్డాయి. గత ఎన్నికల్లోనూ ఈ సీటు ఎంతో ఆసక్తిని రేపింది. 2018 ఎన్నికల్లో ఈ సీటు నుంచి రేవంత్ రెడ్డి ఓడిపోవటం.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలవటం జరిగింది. తాజాగా మళ్లీ రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పావులు కదుపుతున్నారు. దీంతో కొడంగల్ రాజకీయం... రసవత్తరంగా మారినట్లు అయింది.

కొడంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి
కొడంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి (twitter)

Kodangal Assembly Constituency: కొడంగల్... రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అత్యంత ఆసక్తికరంగా రాజకీయాలు జరిగే సీటు..! రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాగైనా ఈ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావించినా... 2014 లో వర్కౌట్ కాలేదు. కానీ 2018లో జరిగిన ముందస్తు ఎలక్షన్స్ లో గులాబీ జెండా రెపరెపలాడింది. అప్పట్లో ఈ ఫలితం అందరిలోనూ ఆసక్తిని రేపింది. కారణం.. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..! బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శించే రేవంత్ రెడ్డి... అనూహ్యంగా ఇక్కడ్నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్లాన్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లు అయింది. కట్ చేస్తే... మళ్లీ రేవంత్ రెడ్డి కొడంగల్ పై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెక్ పెట్టే దిశగా పావులు కదిపే పనిలో పడ్డారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కొడంగల్ సీటు... మరోసారి ఇరు పార్టీలకు సవాల్ మారటం ఖాయంగా కనిపిస్తోంది.

కీలకంగా మారిన భేటీ..!

ఇక తాజాగా హాత్సే హాత్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీ కొడంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రాజకీయంగా గురునాథ్ రెడ్డి.. రేవంత్ రెడ్డి బద్ధ శత్రవులు. గతంలో టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ నుంచి గురునాథ్ రెడ్డి రేస్ లో ఉండేవారు. ఇరువర్గాల మధ్య నిత్యం వార్ నడిచేది. ఈ సీటు నుంచి గురునాథ్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత... ఆయన కాంగ్రెస్ ను వీడి... బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో ఉన్న రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావటంతో కొడంగల్ లో సీన్ మారింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో(2018) ఆయన కాంగ్రెస్ లో నుంచి బరిలో ఉండగా.. గురునాథ్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఈ స్థానం నుంచి పట్నం నరేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఈ సమయంలో గురునాథ్ రెడ్డి అసంతృప్తికి గురి అయినప్పటికీ... నరేందర్ రెడ్డి విజయం కోసం పని చేశారు. దీంతో రేవంత్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత గురునాథ్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ.. క్రమంగా దూరంగా ఉండిపోయారు. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. ఇటీవల షర్మిలతో కూడా భేటీ అయ్యారు. అయితే ఆయన ఆ పార్టీలోకి వెళ్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. తాజాగా రేవంత్ రెడ్డే స్వయంగా... గురునాథ్ రెడ్డిని కలవటంతో ఒక్కసారిగా కొడంగల్ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. దీంతో అనేక సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

సీటు ఆయనకేనా..?

బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న గురునాథ్ రెడ్డిని రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గురునాథ్ రెడ్డి కుమారుడు ప్రస్తుతం కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్నారు. ఇక కొడంగల్ లో గురునాథ్ రెడ్డికంటూ ఓ వర్గం ఉంది. అంతేకాదు ఆయన బలమైన నేతగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ సీటు ఆయనకు ఇస్తారా..? అనే చర్చ మొదలైంది. త్వరలోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే వయసు దృష్ట్యా గురునాథ్ రెడ్డి పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపకపోతే... ఆయన కుమారుడికి అవకాశం ఇస్తారని సమాచారం. ఫలితంగా బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా షాక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఇప్పట్నుంచే ఆపరేషన్ షురూ చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ మరో చర్చ కూడా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి... కొడంగల్ నుంచి బరిలో ఉండే అవకాశం లేదనే చర్చ జోరందుకుంది. అయితే ఆయన... జీహెచ్ఎంసీ పరిధిలోని ఏదైనా ఒక సీటు నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఫైనల్ గా ఏం జరుగుతుందనేది మాత్రం... ఎన్నికల ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తం ఎన్నికలకు ముందే కొడంగల్ అడ్డాలో ప్రధాన పార్టీలు కారాలు మిరియాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలో తాజా భేటీ కూడా ఆసక్తికర పరిణామంగా మారిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గురునాథ్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్ ను వీడుతారా..? రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతుందా..? అనేది చూడాలి.

IPL_Entry_Point