BRS Expansion: మరో రాష్ట్రంలో 'బీఆర్ఎస్' జెండా... భారీ సభకు తేదీ ఫిక్స్..!-brs party to hold first public meet in nanded on 5th february 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Expansion: మరో రాష్ట్రంలో 'బీఆర్ఎస్' జెండా... భారీ సభకు తేదీ ఫిక్స్..!

BRS Expansion: మరో రాష్ట్రంలో 'బీఆర్ఎస్' జెండా... భారీ సభకు తేదీ ఫిక్స్..!

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 06:40 AM IST

KCR National Party: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టి అదే పనిలో ఉన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన నేతలను కూడా చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజాలు పడగా... నెక్స్ట్ మహారాష్ట్రలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Public Meeting in Nanded: తెలంగాణ రాష్ట్ర సమితి.. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పేలా పక్కాగా పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ విస్తరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలు పార్టీలోకి రావటం.. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించటంతో పాటు త్వరలోనే సభకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మరో సరిహద్దు రాష్ట్రంలోనూ విస్తరించే పనిలో పడ్డారు కేసీఆర్. వచ్చే నెలను ఇందుకు ముహుర్తంగా ఫిక్స్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ తాజాగా మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో ఊరురా పార్టీని విస్తరించాలని చూస్తోంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. పలు గ్రామాల్లో పర్యటిస్తూ... ప్రచారం కూడా చేస్తున్నారు. త్వరలోనే కమిటీలు కూడా వేయనున్నట్లు సమాచారం. ఇక నాందేడ్ జిల్లా భోకర్ తాలుకా కీని గ్రామంలో తొలి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. పలు పార్టీలకు చెందిన వారు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఓవైపు గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనులు సాగుతుండగానే... మరోవైపు భారీ సభను నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 5న సభ..!

నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని గ్రామాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి వారితో బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు గ్రామాలు.. తెలంగాణలో కలపాలని కూడా కోరుకుంటున్నాయి. ఆయా గ్రామాలు కూడా తీర్మానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో ధర్మాబాద్, భోకర్, బిలోలి, దెగ్లూర్, నర్సి, నాయగాం, ముత్కేడ్, ఉమ్రి, కిన్వట్ వంటి గ్రామాలు ఉన్నాయి. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రాంతంలో పార్టీని విస్తరించడం సులభ తరమవుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలువురు నేతలు సభాస్థలిని కూడా పరిశీలించారు. ఏర్పాట్లు విషయంలో కూడా స్థానిక నేతలతో సమన్వయం చేస్తున్నారు. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు.

భారీ సభను నిర్వహించటం ద్వారా... స్థానికంగా ఉండే ప్రజలకు గట్టి సందేశాన్ని పంపాలని చూస్తోంది. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక్కడ సభను విజయవంతం చేసి... ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరణ కార్యాచరణను వేగవంతం చేయాలని చూస్తోంది బీఆర్ఎస్.

Whats_app_banner

సంబంధిత కథనం