BJP On BRS Meeting : బీఆర్ఎస్ తొలి సభ ‘‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’’ అట్టర్ ఫ్లాప్…బండి
BJP On BRS Meeting ఖమ్మంలో బిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ఆవిర్భావ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను యాదాద్రి తీసుకెళ్లారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
BJP On BRS Meeting కేసీఆర్ నోటి వెంట ఏ దేశం పేరు వస్తే... ఆ దేశం పని ఔట్ అని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలే ఇందుకు ఉదాహరణ అని బండి సంజయ్ విమర్శించారు. క్రిష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను వాడుకోలేని కేసీఆర్ దేశ జల విధానం గురించి మాట్లాడటం ఏమిటన్నారు.
ప్రాజెక్టులు కట్టి సాగు నీరందిస్తే, తెలంగాణలో వ్యవసాయ బోర్ల సంఖ్య ఎందుకు పెరుగుతోందని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ సరఫరా చేయడం లేదని తాను నిరూపిస్తానని, కేసీఆర్ అందుకు సిద్ధమేనా అని సవాలు చేశారు.
అగ్నిపథ్ ను రద్దు చేసే సంగతి తరువాత చూడొచ్చని, పోలీస్ ఉద్యోగాలను సక్రమంగా భర్తీ కాక లక్షల మంది నష్టపోతున్నారని, వాళ్ల సంగతి చూడాలన్నారు. తుపాకీ రాముడి టోపీ పెట్టుకున్న కేసీఆర్ మేక్ ఇన్ ఇండియా ను విమర్శించడమా అని నిలదీశారు. తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు చోటివ్వని మనిషి మహిళలకు 35 శాతం రిజర్వేషన్ల ఇస్తాడని ఎద్దేవా చేశారు.
మహిళా బిల్లును చింపేసిన ఎస్పీ నేతను పక్కన పెట్టుకుని మాట్లాడటం సిగ్గు చేటని, తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ‘జై తెలంగాణ’ పదాన్ని విస్మరించిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు. హిందూ దేవుళ్లను, మతాన్ని కించపరిస్తే మతతత్వం కాదా అని ప్రశ్నించారు. మోదీని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే బీఆర్ఎస్ సభ పెట్టినట్లు ఉందన్నారు.
కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ పుట్టిన రోజు సెక్రటేరియట్ ను ప్రారంభించడమేమిటన్నారు. అంబేద్కర్ జయంతి నాడు కొత్త సచివాలయాన్ని ఎందుకు ప్రారంభించడం లేదన్నారు.
కేసీఆర్ దగ్గరకు ఒకసారి వచ్చినోళ్లు మళ్లీ రారని, కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి రాలేదని, బీహార్ సీఎం నితీష్ కుమార్ రాలేదని నిన్న ఖమ్మం సభకు వచ్చినోళ్లు మళ్లీ కేసీఆర్‌కు కనపడరని బండి విమర్శించారు. లిక్కర్ దందా సొమ్మును లీడర్లకు పంచి పెట్టారని ఆరోపించారు.
యాదాద్రి ఆలయానికి ముగ్గురు సీఎంలను తీసుకుపోతే ఆ రూట్ లో ప్రయాణీకులు నరకం చూశారని, 4 గంటలపాటు భక్తులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ఒక సీఎం అసలు గుడిలోకే రానన్నారని, యాదాద్రి ఆలయంతో ఎట్లా వ్యాపారం చేస్తున్నమో చెప్పడానికే కేసీఆర్ వాళ్లను తీసుకుపోయినట్లుందన్నారు.
5 వేల టీఎంసీల నీళ్లను ఎట్లా నిల్వ చేస్తారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దేశం గురించి తరువాత క్రిష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలో సగం కూడా వాడుకోలేదన్నారు.
2014లో తెలంగాణ 18 లక్షల బోర్లున్నాయని, వ్యవసాయానికి సాగు నీరందిస్తే బోర్ల సంఖ్య తగ్గాలని కానీ వ్యవసాయ బోర్ల సంఖ్య 24 లక్షలకు పెరిగిందన్నారు. నిజంగా ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తే బోర్ల సంఖ్య తగ్గాలి కదా అని నిలదీశారు.
తెలంగాణలో 24 గంటల వ్యవసాయ విద్యుత్ ను ఎక్కడా సరఫరా చేయడం లేదనే విషయాన్ని నిరూపిస్తానన్నారు. డిస్కంలను వేల కోట్ల నష్టాలపాల్జేశారని, ఆ డబ్బులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ అంధకారంలో ఉండే పరిస్థితి ఉందన్నారు.