KCR In Republic Day : సమాఖ్య స్ఫూర్తితోనే దేశంలో అభివృద్ధి….కేసీఆర్-telangana cm says country will develop with federal spirit among the states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr In Republic Day : సమాఖ్య స్ఫూర్తితోనే దేశంలో అభివృద్ధి….కేసీఆర్

KCR In Republic Day : సమాఖ్య స్ఫూర్తితోనే దేశంలో అభివృద్ధి….కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Jan 26, 2023 11:08 AM IST

KCR In Republic Day రాష్ట్రాల సమాఖ్యగా వెలుగొందుతున్న భారత దేశంలో, ఫెడరల్‌ స్ఫూర్తికి అనుగుణంగా దేశ ప్రజలందరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందేలా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం విలసిల్లుతుందని, దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్, పెరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.

ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సిఎం కేసీఆర్
ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సిఎం కేసీఆర్

KCR In Republic Day గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమర జవానులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవానుల త్యాగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు.

రకరకాల పూలతో కూడిన పుష్పగుచ్ఛం మాదిరి భిన్న సామాజిక నేపథ్యాలు, సంసృతులు, సంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో.. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటమే భారతదేశ ప్రధాన లక్షణమని కేసీఆర్‌ రిపబ్లిక్‌ డే సందేశంలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకొంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకొన్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఆ ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సమానత్వంతో కూడిన సమర్థ, ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందన్నారు. భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురసరించుకొని దేశ ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సర్వసత్తాక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారత్‌లో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన రోజు దేశ పౌరులందరికీ పండుగ దినమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రజలు సదా స్మరించుకొంటారని తెలిపారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు నివాళులు అర్పించారు.ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్.. పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలోనే వీరుల సైనిక స్మారకం దగ్గర సర్వమత ప్రార్థనలు చేశారు. త్రివిధ దళ అధికారులు కూడా పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు.

Whats_app_banner