KCR on BRS Expansion : సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ లో మరిన్ని చేరికలు ?-cm kcr plans to expand brs further after sankranti festival more ap leaders to join party soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Plans To Expand Brs Further After Sankranti Festival More Ap Leaders To Join Party Soon

KCR on BRS Expansion : సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ లో మరిన్ని చేరికలు ?

Thiru Chilukuri HT Telugu
Jan 15, 2023 09:22 PM IST

KCR on BRS Expansion : ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత .. పార్టీ విస్తరణలో వేగం పెంచాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో భారీగా చేరికలకు ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చేరికలు ఉంటాయని అంటున్నారు. ఖమ్మం సభ తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే సూచనలు ఉన్నాయి.

బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ కసరత్తు
బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ కసరత్తు (twitter)

KCR on BRS Expansion : బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని. జనవరి 18న ఖమ్మంలో ఆవిర్భావ సభ అనంతరం వేగంగా ముందుకెళ్లే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను ఇటీవలే నియమించిన కేసీఆర్... ఒడిషా అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ను త్వరలో ప్రకటించనున్నారు. గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ తదితరులున్నారు. ఈ సందర్బంగా... ఒడిశాలో పార్టీ విస్తరణ, అధ్యక్ష బాధ్యతలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు... సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని ఇటీవల కేసీఆర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాల నుంచి 70 మందికి పైగా నాయకులు కేసీఆర్‌ను కలిసి స్థానికంగా కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక నుంచి కూడా చేరికలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత... దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో వేగం పెరుగుతుందని... జాతీయ స్థాయి అంశాలపై జరిగే పోరాటాల్లో కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొంటారని అంటున్నారు.

అబ్‌ కీ బార్‌ కిసాన్ సర్కారు నినాదంతో దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తోన్న కేసీఆర్.. అన్ని రాష్ట్రాల్లో ముందుగా రైతు విభాగాలను పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ జాతీయ కిసాన్ విభాగం అధ్యక్షుడిగా.. హర్యాన కురుక్షేత్ర కు చెందిన గుర్నామ్ సింగ్ చడూని ఇప్పటికే నియమించారు. జనవరి చివరి వారం కల్లా.... తెలంగాణ, ఏపీతో పాటు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో కిసాన్ విభాగాలను ప్రారంభించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇక... ఖమ్మం సభ ముగిసిన తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాలు, సంఘాల ప్రతినిధులు, మేథావులు, విశ్రాంత అధికారులు పార్టీలో చేరేలా సన్నాహాలు చేస్తారని చెబుతున్నారు.

ఖమ్మంలో ఆవిర్భావ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు కరీంనగర్ సింహగర్జన తరహాలో.. ఖమ్మం బహిరంగ సభ బీఆర్ఎస్ కు ఊపునిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ,ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర నుంచి జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 5 లక్షల జనం హాజరయ్యేలా చూడాలని ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రి హరీష్‌ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు ఖమ్మంలోనే ఉండి సభ నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం విజయన్‌తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, వివిధ రాష్ట్రాల నేతలు సభకు హాజరు కానున్నారు. జాతీయ స్థాయి కమ్యూనిస్టు నేతలు కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొంటారని గులాబీ నేతలు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా స్థానిక సీపీఎం, సీపీఐ నేతలను కలుపుకొని పోవాలని గులాబీ కార్యకర్తలకు సూచిస్తున్నారు.

WhatsApp channel