BRS in Karnataka: కన్నడ రాజకీయాల్లో బీఆర్ఎస్ చిచ్చు! నిజమేనా..?-brs party triggers row in karnataka politics over upcoming assembly elections
Telugu News  /  Telangana  /  Brs Party Triggers Row In Karnataka Politics Over Upcoming Assembly Elections
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కుమారస్వామి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కుమారస్వామి (facebook)

BRS in Karnataka: కన్నడ రాజకీయాల్లో బీఆర్ఎస్ చిచ్చు! నిజమేనా..?

25 January 2023, 15:45 ISTMahendra Maheshwaram
25 January 2023, 15:45 IST

BRS Expansion: బీఆర్ఎస్ ను పలు రాష్ట్రాల్లో విస్తరించే పనిలో పడ్డారు కేసీఆర్. దీంతో యాక్షన్స్, రియాక్షన్స్ నెమ్మదిగా తెరపైకి వచ్చేస్తున్నాయి. అయితే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం... కాస్త ఆసక్తికరంగానే మారింది. ఫలితంగా రెండు జాతీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తోంది.

BRS Party Updates: టీఆర్ఎస్... బీఆర్ఎస్ అయిపోయింది. జాతీయ స్థాయిలో విస్తరించే పనిలో ఉన్నారు కేసీఆర్. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభను కూడా అదరగొట్టారు. ముగ్గురు సీఎంలను అతిథులుగా రప్పించారు. అయితే ప్రతి బీఆర్ఎస్ ప్రతి కార్యక్రమానికి వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మాత్రం రాలేదు. ఈ పరిణామం కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు... ప్రస్తుతం బీఆర్ఎస్ మేటర్... కర్ణాటకలోని రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కూడా దారి తీసింది. ఇదీ కాస్త కన్నడ పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.

సైలెంట్ వార్...!

బీఆర్ఎస్ అంశం... ప్రధానంగా కన్నడ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొద్దిరోజుల కిందట కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ హైదరాబాద్ వచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇది జరిగి నెల రోజులు గడిచిపోయింది. అయితే ఈ విషయంలో అప్పుడు బయటికి రాకపోగా... తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ సందర్భంగా బయటపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ అక్కడి నేతలను ప్రలోభపెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్ రూ.500 కోట్లు ఆఫర్ చేశారని అని కూడా అన్నారు. ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలవకుండా కేసీఆర్ చూస్తున్నారని కామెంట్స్ చేశారు. అయితే కేసీఆర్ ను కలిసిన సదరు ఎమ్మెల్యే కూడా.. భేటీని ధ్రువీకరించినప్పటికీ.. కేవలం వ్యాపార సంబంధాల కోసమే కలిశానని.. ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఈ పరిణామమే కన్నడ కాంగ్రెస్ లో అలజడి మొదలైంది.

కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే... సిద్ధరామయ్య వర్గం. అయితే కన్నడ కాంగ్రెస్ లో డీకె శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య వర్గం అన్నట్లు కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్నాయి. అయితే సదరు ఎమ్మెల్యే సిద్ధరామయ్య వర్గం కావటం, కేసీఆర్ ను హైదరాబాద్ లో కలిసిన నేపథ్యంలో... డీకే శివకుమార్ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడిపోయారు. సిద్ధరామయ్యను అధినాయకత్వం దృష్టిలో కర్నర్ చేసే దిశగా పావులు కూడా కదిపారు. ఈ క్రమంలో సైలెంట్ వార్ షురూ అయింది. అయితే రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చింది కూడా డీకె శివకుమారే అన్న చర్చ కూడా జోరందుకుంది.

ఈ పరిణామాన్నీ బీజేపీ కూడా క్యాష్ చేసుకునే దిశగా మాటల దాడిని పెంచుతోంది. కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయంటూ మాటల దాడిని పెంచుతోంది. అయితే కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించటంతో ఈ వాదనను పలువురు హస్తం నేతలు కూడా ఏకీభవిస్తున్నారు. ఫలితంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… కర్ణాటకలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే... మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుమార స్వామి రాకపోవడానికి కూడా కీలకమైన కారణం ఉందనే వార్తలు వస్తున్నాయి. జేడీఎస్ తో బీజేపీ చర్చలు జరిపిందని.. ఇందుకు దేవెగౌడ కూడా సమ్మతి తెలిపారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి... బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రాలేదని చర్చ వినిపిస్తోంది. మొత్తంగా తాజా పరిణామాలతో కన్నడ పాలిటిక్స్ లో బీఆర్ఎస్ మాత్రం ఓ హాట్ టాపిక్ గా మారిందనే చెప్పొచ్చు. ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వస్తున్న వార్తలన్నీ నిజమేనా..? లేక ఊహాగానాలేనా..? అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.