YS Sharmila : జనవరి 28 నుంచి ప్రజాప్రస్థాన యాత్ర.. షర్మిలతో పొంగులేటి భేటీ.. ?-ys sharmila to start praja prasthana yatra from january 28 ponguleti srinivas reddy meets sharmia ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ys Sharmila To Start Praja Prasthana Yatra From January 28 Ponguleti Srinivas Reddy Meets Sharmia

YS Sharmila : జనవరి 28 నుంచి ప్రజాప్రస్థాన యాత్ర.. షర్మిలతో పొంగులేటి భేటీ.. ?

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 07:17 PM IST

YS Sharmila : ప్రజాప్రస్థాన యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పాదయాత్ర కేసీఆర్ పాలిట అంతిమ యాత్రగా మారుతుందని హెచ్చరించారు. తనకు భయపడే కేసీఆర్ ఖమ్మంలో బహిరంగ సభ పెట్టాడని వ్యాఖ్యానించారు. మరోవైపు... బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. షర్మిలతో సమావేశమైనట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (twitter)

YS Sharmila : జనవరి 28 నుంచి ప్రజా ప్రస్థానయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. గతంలో పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో.. తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతామని స్పష్టం చేశారు. తన యాత్రను ఆపి కేసీఆర్ పెద్ద పొరపాటు చేశారని... ఈ సారి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ పాదయాత్ర కేసీఆర్ పాలిట అంతిమ యాత్రగా మారుతుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కాస్కో.. అని సవాల్ విసిరారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల... పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా యాత్ర జరుగుతుందని.. అరెస్టు చేస్తామంటే చేస్కోండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావన్న షర్మిల... ప్రజావ్యతిరేకత ఉందన్న విషయం కేసీఆర్ కి కూడా తెలుసని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయ్యాక మొదటి సభ ఖమ్మంలోనే ఎందుకు పెట్టారని షర్మిల ప్రశ్నించారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తున్నానని తెలిసి... కేసీఆర్ భయపడి ఖమ్మంలో సభ పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్లే రైతులు డీపాల్టర్లుగా మారారని.. రైతుబంధు పేరుతో రూ. 5 వేలు ఇచ్చి... ఏటా రూ. 30 వేల ప్రయోజనాలు కల్పించే మిగతా పథకాలను ఈ ప్రభుత్వం మూలన పడేసిందని ఆరోపించారు. 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని.. లక్షల మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోయాయని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. కేసీఆర్ సర్కార్ అవినీతిని ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అని.... కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్ల అవినీతి గురించి మాట్లాడింది తానే అని ... ఢిల్లీ వరకు వెళ్లి సీబీఐ, కాగ్ కి ఫిర్యాదు చేశామని షర్మిల గుర్తు చేశారు.

అత్యంత ప్రజాదరణ ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డిని కిరాతకంగా నరికి చంపారని... వివేకా లాంటి ప్రజా నాయకుడి కేసు విచారణ ఆలస్యం సరికాదని షర్మిల అన్నారు. త్వరగా విచారణ పూర్తి చేస్తేనే సీబీఐ పై విశ్వాసం కలుగుతుందని అన్నారు. విచారణ త్వరగా పూర్తి చేయాలని వైఎస్ కుటుంబం కోరుకుంటోంది అని చెప్పారు. దోషుల్ని త్వరగా పట్టుకొని శిక్షించాలని కోరారు. ఈ క్రమంలో... సీబీఐపై ఏపీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు... ఉండకూడదు అని షర్మిల జవాబు ఇచ్చారు.

మరోవైపు... బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. షర్మిలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒక రహస్య ప్రాంతంలో సుమారు గంట పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా... పార్టీలో చేరాలని వైఎస్ షర్మిల... పొంగులేటిని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో... ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. వైఎస్ఆర్ అభిమాని అయిన పొంగులేటి... గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రభావం చూపారు. ఈ నేపథ్యంలోనే.... ఆయన పార్టీలోకి వస్తే ఖమ్మంలో వైఎస్సార్టీపీ మరింత బలపడుతుందన్న ఉద్దేశంతో... వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point