తెలుగు న్యూస్  /  Telangana  /  Renovation Of 700 Years Old Stepwell In Rachakonda

Rachakonda Stepwell : 700 ఏళ్ల నాటి మెట్లబావి.. పునర్వైభవం దిశగా అడుగులు

13 January 2023, 18:06 IST

    • Rachakonda Stepwell Renovation: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మెట్లబావులు దర్శనమిస్తుంటాయి. అయితే కొన్నింటికి మాత్రం చాలా చరిత్ర ఉంటుంది. ఈ మధ్యనే బన్సీలాల్ పేటలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన మెట్లబావి తిరిగి పునరుద్ధరించారు. తాజాగా రాచకొండ పరిధిలోనూ మరో మెట్లబావి సిద్ధం అవుతోంది.
రాచకొండ మెట్లబావి
రాచకొండ మెట్లబావి (twitter)

రాచకొండ మెట్లబావి

Stepwell Renovation in Rachakonda: రాచకొండ... అంటేనే ఓ చరిత్ర..! వేల సంవత్సరాల చరిత్రకు ఈ కొండ ఓ నిదర్శనం. రేచర్ల పద్మ నాయకులు ఏలిన కొండ రాచకొండ ఏంతో ప్రత్యేకమనే చెప్పొచ్చు. తెలంగాణ చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. గుట్ట చుట్టూ శత్రు దుర్భేద్యమైన రాతి కట్టడాలు, 200 అడుగుల నుంచి జాలువారే జలపాతాలు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. అలాంటి చరిత్రాక నేపథ్యాన్ని కలిగి ఉన్న రాచకొండ... క్రమంగా టూరిజం సెంటర్ గా మారుతోంది. జనాల తాకిడి పెరుగుతోంది. చరిత్రను తెలిసేలా రాచకొండ ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన రాచకొండలో... ఓ మెట్లబావి కూడా ఉంది. అయితే ఇన్నాళ్లు పనికిరాకుండా పోయిన ఆ బావిని పునరుద్ధరించే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

Sangareddy fake Documents: నకిలీ పత్రాలను సృష్టించి ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

TSPSC Group 1 Exam Updates : ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - TSPSC ప్రకటన

ఇక్కడ 700 ఏళ్ల క్రితం నాటి మెట్లబావి ఉంది. కాలక్రమేణా పూర్తిగా ధ్వంసమైపోయింది. పూర్తిగా నాచు, చెట్లతో నిండిపోయింది. ఎంతో చరిత్రకు నిదర్శనమైన ఈ బావిని పునరుద్ధరించేలా తెలంగాణ సర్కార్ నడుంబిగించింది. మునుగోడు నియోజవవర్గ పరిధిలో ఉన్న ఈ బావి.. బాగుచేసేందుకు యాదాద్రి జిల్లా అధికారులు ప్రణాళికలు కూడా రూపొందించారు. నిధులు మంజూరు కావటంతో పనులు కూడా నడుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా పలుమార్లు బావిని సందర్శించారు. జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు.

దాదాపు రూ. 30లక్షలతో మెట్ల బావిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా మెట్ల బావిలోని నీటిని భారీ మోటర్లతో తోడేస్తున్నారు. బావిలోని బురద, మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేస్తున్నారు. బావి చుట్టూ ఫెన్సింగ్‌, లైటింగ్‌ ఏర్పాటు చేసి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మెట్ల బావిని అభివృద్ధి చేస్తుండడంతో పర్యాటక ప్రేమికులు, ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రాచకొండ ప్రాంతంలో విహంగ వీక్షణం చేశారు. సినిమా పరిశ్రమ నెలకొల్పేలా చర్యలు తీసుకోవటంతో పాటు టూరిజం స్పాట్ గా మారుస్తామని కూడా హమీనిచ్చారు.

ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో రాచకొండ పరిసర ప్రాంతాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రాచకొండకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పిస్తే ఇంకా బాగుంటుందని చెబుతున్నారు.