History: రాచకొండ గుట్టల్లో ఆత్మాహుతి వీరగల్లులు - తెలంగాణలో ఇదే తొలిసారంట!-veeragallu sculptures identified at loyapalli area in rachakonda fort rangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  History: రాచకొండ గుట్టల్లో ఆత్మాహుతి వీరగల్లులు - తెలంగాణలో ఇదే తొలిసారంట!

History: రాచకొండ గుట్టల్లో ఆత్మాహుతి వీరగల్లులు - తెలంగాణలో ఇదే తొలిసారంట!

Mahendra Maheshwaram HT Telugu
Aug 25, 2022 06:23 AM IST

Rare Veeragallu Sculptures Identified: రాచకొండ గుట్టల పరిధిలో సరికొత్త చరిత్ర ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకేచోట ఐదు ఆత్మాహుతి వీరగల్లుల శిల్పాలు వెలుగు చూశాయి. తెలంగాణలో ఇలాంటి శిల్పాలు బయటపడం ఇదే తొలిసారి అని ఆధునిక చరిత్రకారులు అంటున్నారు.

<p>ఆత్మాహుతి వీరగల్లులు</p>
ఆత్మాహుతి వీరగల్లులు (facebook)

Rare Veeragallu Sculptures in Rachakonda Area: ఆత్మార్పణ చేసుకునే వీరభక్తిని తెలిపే ఆత్మార్పణ శిల్పాలు రాచకొండ గుట్టల ప్రాంతాల్లో వెలుగు చూశాయి. తెలంగాణ ప్రాంతంలో కొన్నిచోట్ల ఈ తరహా విగ్రహాలు కనిపించినప్పటికీ... ఇక్కడ దొరికిన విగ్రహాలు మాత్రం విభిన్నమైనవిగా తేల్చారు ఆధునిక చరిత్రకారులు. ఇక్కడ తల నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టువిగా గుర్తించారు.

veeragallu sculptures in loyapalli: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని లోయపల్లి పరిధిలో ఒకే చోట ఈ 5 ఆత్మాహుతి వీరగల్లుల శిల్పాలు బయల్పడ్డాయి. ఆధునిక తెలంగాణ చరిత్రకారుల బృందం సభ్యుడు దండేటికర్ యాదేశ్వర్‌ వీటిని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనరు రామోజు హరగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిల్పాలు చాళుక్య శైలిలో ఉన్నట్టు ప్రకటించారు. రెండు శిల్పాల్లో ఇద్దరు వీరులు అంజలి ఘటించి కూర్చున్నట్టు ఉన్నదని, ఆ వీరుల కీర్తి ఆచంద్రార్కం విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ వారి తలలకు ఇరువైపులా సూర్య, చంద్రులను చెక్కారని వెల్లడించారు.

veeragallu history: తలలపై చిన్న కిరీటాలు, చెవులకు జూకాలు, మెడలో హారాలు, భుజ కిరీటాలతోపాటు దండరెట్టలకు, ముంజేతులకు కంకణాలు ధరించి అర్ధ పద్మాసనంలో కూర్చున్న ఈ వీరగల్లుల శిల్పాలు చాలా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. ఆత్మాహుతి శిల్పాల్లో ఇవి చాలా అరుదైనవని, తెలంగాణలో ఇలాంటి శిల్పాలు కనిపించటం ఇదే తొలిసారి అని తెలిపారు. మధ్యలో ఉన్న ఓ విగ్రహం నడుము వరకు విరిగిపోయి ఉన్నదని, మిగిలిన రెండు శిల్పాల్లో ఇద్దరు వీరులు కుడిచేతపట్టిన కత్తులతో తమ తలలను నరుక్కొని ఎడమచేతుల్లో పట్టుకొని కనిపిస్తున్నట్టు వివరించారు.

ఈ వీరగల్లులు 14, 15వ శతాబ్ద కాలం నాటివిగా గుర్తించారు. శత్రువుల నుంచి ఊరి పొలిమేరల్ని, స్త్రీలను, పశువులను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల జ్ఞాపకార్థం చేసిన విగ్రహ శిలలను వీరగల్లులు అంటారు అని హరగోపాల్ వివరించారు.

Whats_app_banner