IIT Hyderabad : ఆ తెగ జనాభా 4,811 మాత్రమే.. ఐఐటీ హైదరాబాద్ డాక్యుమెంటరీ
25 August 2022, 16:48 IST
- Thoti Tribals : చరిత్రలో ఎన్నో తెగలు.. కొన్ని అంతరించిపోయాయి. ఇప్పుడు మరికొన్ని అంతరించిపోయేందుకు దగ్గరలో ఉన్నాయి. వారి జనాభా తక్కువగా ఉండటంతో వారి గురించి పెద్దగా బయటి ప్రపంచానికి తెలియదు. వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉంటాయో విని ఉండం. అలాంటి ఓ తెగపై ఐఐటీ హైదరాబాద్ డాక్యుమెంటరీ చేస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
అంతరించిపోతున్న గిరిజన తెగల్లో ఒకటి తోటిలు. వీరు ఉన్నది ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే. ప్రకృతితోనే వారి జీవనం. అడవి తల్లి ఓడిలోనే వారికి ఆనందం. వారి సంస్కృతి, సంప్రదాయం భిన్నంగా ఉంటుంది. చూడముచ్చటగా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో తోటి గిరిజనుల జనాభా 4,811 మాత్రమే ఉంది. వారి జీవన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయి. ఎందుకంటే కొంతమంది సంఘం సభ్యులు మాత్రమే సాంప్రదాయ వృత్తులను ఆచరిస్తున్నారు. వారి జీవన సంప్రదాయాలను డాక్యుమెంట్ చేయడం, రక్షించడం అనేది ముఖ్యమైన అవసరం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ తోటి గిరిజనులపై డాక్యుమెంటరీ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న తోటి కమ్యూనిటీ సంప్రదాయ పద్ధతులపై పరిశోధిస్తోంది. వారిని సంరక్షించడానికి చొరవ తీసుకుంది.
తోటిలది రాజ్ గోండులతో సంబంధం ఉన్న గిరిజన సంఘం. గోండ్వానా రాజ్యం చరిత్రను మౌఖిక చరిత్ర రూపంలో సజీవంగా ఉంచుతూ 'గోండ్ గాథ' పాడటం తోటిల సాంప్రదాయంలో భాగం. తోటిలు గోండు పోషకులపై ఆధారపడి జీవనోపాధి పొందేవారు. ఈ తెగకు చెందిన మహిళలు సాంప్రదాయ పచ్చబొట్టు వేసేవారు. అయితే ప్రస్తుతం వీరి సంప్రదాయ పద్ధతులు క్రమంగా తగ్గుతున్నాయి. కొన్ని కుటుంబాలు మాత్రమే.. ఇప్పటికీ పాత పద్ధతులను కొనసాగిస్తున్నాయి. వాటిని సజీవంగా ఉంచడం ద్వారా వారి సంప్రదాయాలను కాపాడుతున్నాయి.
ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ మార్గదర్శకత్వంలో పరిశోధనా బృందం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలోని తోటి గూడలో క్షేత్ర పర్యటన నిర్వహించింది. తోటి కమ్యూనిటీ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి సాంప్రదాయ సంగీతం రికార్డ్ చేసింది.
'ఈ డాక్యుమెంటరీ.. తోటిల పురాతన సంప్రదాయాలు, సైన్స్‌ను అందంగా వివరిస్తుంది. ఈ అద్భుతమైన టెక్నిక్‌లను ప్రదర్శించడం, సాంస్కృతిక విలువలను నిలబెట్టుకోవడంలో సహాయం చేయడం మా లక్ష్యం. నేటి తరానికి ఇలాంటి తెగల గురించి చెప్పడం అవసరం.' అని దీపక్ జాన్ మాథ్యూ అన్నారు.
డిజైన్ కాన్సెప్ట్‌ని ఉపయోగించి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, భవిష్యత్ తరాలు వాటిని కొనసాగించేలా ప్రోత్సహించడం మా నినాదం అని IIT హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. సాంకేతికత సహాయంతో గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఐఐటీహెచ్ గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా ఉందన్నారు. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కూడా ఉందని చెప్పారు.