తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Modi Tour : హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో- రెండు గంటల పాటు ఆ మెట్రో స్టేషన్లు క్లోజ్, ట్రాఫిక్ ఆంక్షలు

PM Modi Tour : హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో- రెండు గంటల పాటు ఆ మెట్రో స్టేషన్లు క్లోజ్, ట్రాఫిక్ ఆంక్షలు

27 November 2023, 15:09 IST

    • PM Modi Tour : ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో పాటు ప్రధాని రోడ్ షో కారణంగా రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటల పాటు మూసివేయనున్నారు.
ప్రధాని మోదీ రోడ్ షో
ప్రధాని మోదీ రోడ్ షో

ప్రధాని మోదీ రోడ్ షో

PM Modi Tour : హైదరాబాద్ లోని రెండు మెట్రో రైలు స్టేషన్లను రెండు గంటల పాటు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రధాని మోదీ రోడ్‌ షో నేపథ్యంలో భద్రతా కారణాలతో రెండు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ రోడ్ షో.. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్రారంభం అవుతుంది. నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించి, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Telangana Tourism : బీచ్ పల్లి టెంపుల్, జోగులాంబ శక్తి పీఠం దర్శనం - రూ. 1500కే స్పెషల్ టూర్ ప్యాకేజీ

TS TET 2024 Updates : అలర్ట్... మే 15 నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు, డౌన్లోడ్ లింక్ ఇదే

TS DOST Registration 2024 : డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు, ప్రారంభమైన 'దోస్త్' రిజిస్ట్రేషన్లు - ఇలా ప్రాసెస్ చేసుకోండి

US Indian Student Missing: అమెరికాలో తెలంగాణ విద్యార్ధి అదృశ్యం, మే2 నుంచి అదృశ్యమైన రూపేష్ చింతకింది

ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఐదు వేల మందితో ప్రధాని మోదీకి బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ప్రధాని మోదీ రోడ్ షో మొదలవుతుంది. 2 కి.మీ మేర జరిగే రోడ్‌ షో, అనంతరం కాచిగూడలో ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ర్యాలీలో గ్రేటర్ హైదరాబాద్ లోని 24 మంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొనున్నారు.

ర్యాలీ ఇలా

ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అనంతరం ర్యాలీగా బేగంపేట్‌, గ్రీన్‌లాండ్స్‌, పంజాగుట్ట, మొనప్ప ఐలాండ్‌, రాజ్‌భవన్‌, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్‌, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్‌, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్‌నగర్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు ర్యాలీగా చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌ వరకు ప్రధాని రోడ్‌ షో ఉంటుంది.

ప్రధాని మోదీ రోడ్ షో, ర్యాలీ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి కాచిగూడ ఎక్స్‌రోడ్‌ వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు అమలు చేసే మార్గంలో 17 పాయింట్లను పోలీసులు గుర్తించారు. ప్రధానమంత్రి రోడ్‌షో కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, వాహనదారులు సహాకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను రామ్‌నగర్ సాగర్‌లాల్ ఆసుపత్రి వైపు మళ్లించారు. హిందీ మహావిద్యాలయా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను ఆజామాబాద్ క్రాస్ రోడ్స్ మీదుగా దారి మళ్లించారు.

తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్‌ బండ్ మీదుగా దారి మళ్లించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వెళ్లే వాహనాలను వీఎస్టీ, బాగ్ లింగంపల్లి, క్రౌన్ కేఫ్ మీదుగా మళ్లించారు. హిమాయత్ నగర్ నుంచి నారాయణ గూడ క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాలను హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, సెమెటరీ, రామ్‌కోఠి మీదుగా మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.