Etela Vs Revanth Reddy : ఒట్టేసే అవసరం నాకు లేదు, రేవంత్ రెడ్డి సవాల్ కు ఈటల రెస్పాన్స్
23 April 2023, 9:11 IST
- Etela Vs Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రమాణం సవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి మాట్లాడానని చెప్పుకొట్టారు.
ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు
Etela Vs Revanth Reddy : కాంగ్రెస్ కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని ఈటలకు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాల్ పై స్పందించిన ఈటల...తన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదని తెలిపారు. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని ఈటల స్పష్టంచేశారు. తాను దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై సరైన సమయంలో జవాబిస్తానని ఈటల వెల్లడించారు. ధర్మం కోసం, ప్రజల కోసమే ఆ విధంగా మాట్లాడానన్నారు. తానెప్పుడూ ఎదుటి వారిని కించపరిచే వ్యక్తిని కాదన్న ఈటల... ఈ విషయంపై ఇవాళ సమాధానం చెప్తానన్నారు.
రేవంత్ రెడ్డి ప్రమాణం
ఈటల ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు. రాజీ తన రక్తంలోనే లేదన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానంటూ శుక్రవారం చెప్పిన రేవంత్ రెడ్డి... అన్నట్లుగానే శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఓ దశలో ఎమోషనల్ అయ్యారు. “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు..ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను పోరాటం చేస్తా..అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా...మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు.
సర్వం ధారపోసినా నన్ను కొనలేరు
భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని తెలిపారు రేవంత్ రెడ్డి. తాను హిందువునని, అమ్మవారి నమ్ముతానని అన్న ఆయన... అందుకే ఈటల చేసిన ఆరోపణలను నిరూపించుకోవడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చానని చెప్పారు. తాను కేసీఆర్,టీఆర్ఎస్ నేతల దగ్గర ఒక్కరూపాయి కూడా తీసుకోలేదన్నారు. “నన్ను అమ్ముడుపోయారని అంటావా? కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. ఇది చిల్లర రాజకీయం కాదు... పోరాటం. నా నిజాయితీని శంఖిస్తే మంచిది కాదు. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా..నా జీవితంలో అన్నీ ఉన్నాయి. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. బిడ్డ పెళ్లికి ఖైదీలా వచ్చిపోతే నా ఆవేదన తెలిసేది. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. కేసీఆర్‌ను గద్దెదించడమే నా ఏకైక లక్ష్యం. చివరి రక్తపు బోట్టు వరకు, ఒంట్లో భయం లేకుండా కేసీఆర్ తో పోరాడుతా” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.