Revanth vs Etela : రాజేందర్.. రాజీ నా రక్తంలో లేదు, నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదు
22 April 2023, 22:24 IST
- Revanth Reddy Fires On Etela Rajender: ఈటల రాజేందర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదంటూ ఘాటుగా మాట్లాడారు.
భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద రేవంత్ రెడ్డి
TPCC Chief Revanth Reddy : రాజీ తన రక్తంలోనే లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ 25 కోట్లు ఇచ్చారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానంటూ శుక్రవారం చెప్పిన రేవంత్ రెడ్డి... అన్నట్లుగానే ఇవాళ సాయంత్రం ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఓ దశలో ఎమోషనల్ అయ్యారు. “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు..ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను పోరాటం చేస్తా..అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా...మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు.
భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని తెలిపారు రేవంత్ రెడ్డి. తాను హిందువునని, అమ్మవారి నమ్ముతానని అన్న ఆయన... అందుకే ఈటల చేసిన ఆరోపణలను నిరూపించుకోవడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చానని చెప్పారు. తాను కేసీఆర్,టీఆర్ఎస్ నేతల దగ్గర ఒక్కరూపాయి కూడా తీసుకోలేదన్నారు. “నన్ను అమ్ముడుపోయారని అంటావా? కేసీఆర్ సర్వం ధరపోసినా నన్ను కొనలేరు. ఇది చిల్లర రాజకీయం కాదు... పోరాటం. నా నిజాయితీని శంఖిస్తే మంచిది కాదు. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా..నా జీవితంలో అన్నీ ఉన్నాయి. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. బిడ్డ పెళ్లికి ఖైదీలా వచ్చిపోతే నా ఆవేదన తెలిసేది. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. కేసీఆర్‌ను గద్దెదించడమే నా ఏకైక లక్ష్యం. చివరి రక్తపు బోట్టు వరకు, ఒంట్లో భయం లేకుండా కేసీఆర్ తో పోరాడుతా” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
‘కేసీఆర్, కేటీఆర్ దోపీడీని బయటపెట్టినందుకు నన్ను జైల్లో పెట్టారు. జైల్లో నిద్ర లేని రాత్రులు గడిపాను. కేసీఆర్‌ను ఎదుర్కొని.. ధైర్యంగా నిలబడ్డా. నోటీసులు ఇవ్వగానే ఎవరికో నేను లొంగిపోలేదు. నాపై, పార్టీపై ఆరోపణలు చేస్తారా..? ఈటల రాజేందర్.. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా? నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కదా రాజేంద్రా...? రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు. ఆలోచించి మాట్లాడు. ఈటలపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించాం. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన. అసత్య ఆరోపణలు మంచివి కావు. కేసీఆర్‌ను ప్రశ్నించే గొంతులకు ఇదేనా నువ్విచ్చే గౌరవం ?’’ అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తనపై ఇష్టారీతిన మాట్లాడి, తెలంగాణ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. మున్ముందు ఎవరిని ఎవరు గద్దె దించుతారో తెలుస్తుందన్నారు. రాజేంద్రా.. అందరితో మాట్లాడినట్లు తనతో యథాలాపంగా మాట్లాడవద్దన్నారు. "నేను ఎవడికి భయపడను, ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతా" అని రేవంత్ ఉద్వేగంగా మాట్లాడారు.
తెలంగాణ సమాజం కోసం కొట్లాడే వ్యక్తిగా తనపై బురదజల్లడం మంచిది కాదని హితవు పలికారు రేవంత్ రెడ్డి. ఇదివరకే కేసీఆర్‌తో రాజకీయపరమైన యుద్ధాన్ని కొనసాగించేటప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇదే ఈటల రాజేందర్ అప్పుడు కేసీఆర్ పంచన ఉండేవాడని గుర్తు చేశారు. నువ్వు చేరిన పార్టీలో నీ గుర్తింపు కోసం, కుర్చీ కోసం కక్కుర్తిపడి కేసీఆర్ పైన పోరాడుతున్న తనపై అబద్దపు ప్రచారం చేస్తావా అని నిలదీశారు. తన జీవితం ఏమీ వడ్డించిన విస్తరీ కాదని, కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటడం కోసం తొమ్మిదేళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. కేసీఆర్ దండుపాళ్యం ముఠాలు తన స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా కొట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. ప్రశ్నించే గొంతుల మీద ఈటెల దాడి చేస్తున్నారని, ఆయన వైఖరి తెలంగాణ సమాజానికి నష్టమా..? కాదా...? ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.