TG Indiramma Housing Scheme : 'ఇందిరమ్మ' ఇంటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? వీటిని తెలుసుకోండి
18 December 2024, 7:55 IST
- TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం యాప్ సర్వే చేస్తోంది. అయితే దరఖాస్తు చేసుకుని వారు ఉంటే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలు ఇక్కడ చూడండి…
ఇందిరమ్మ ఇంటి నమూనా
ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించటంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. 30 - 35 ప్రశ్నల ఆధారంగా వివరాలను సేకరించి.. ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను క్రోడీకరించి… అసలైన అర్హులకే స్కీమ్ ను వర్తింపజేయనున్నారు.
భారీగా దరఖాస్తులు…
గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది.
ఈ స్కీమ్ కింద గృహనిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిచనుంది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే ఒకే ఆధార్ నెంబర్ తో వేర్వురు ప్రాంతాల్లో చేసిన దరఖాస్తులను గుర్తించేందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను వినియోగించుకుంటోంది. ఫలితంగా ఏదో ఒక చోట స్వీకరించిన దరఖాస్తును మాత్రమే పరిణనలోకి తీసుకునే పనిలో పడింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సర్వే జరుగుతోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తోంది. యాప్ లో దరఖాస్తుదాడికి ఫొటోలతో పాటు ప్రస్తుతం ఉన్న ఇళ్లు, ఖాళీ స్థలం చిత్రాలను కూడా అప్ లోడ్ చేస్తోంది.
అర్హతలు - ముఖ్య వివరాలు
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారే ఈ పథకానికి అర్హులు అవుతారు.ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు.
- పేదవాళ్ల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వటం, స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయటం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం.
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పూర్తిగా ఇల్లు లేకుండా… ఎలాంటి ఆధారం లేని వారిని తొలి విడతలోనే ఎంపిక చేస్తారు. సొంత జాగాలు ఉన్నవారికి ఈ దశలో ఇళ్లను మంజూరు చేయనున్నారు.
- సర్కార్ ఇచ్చే రూ.5 లక్షలను దఫాలవారీగా ఇస్తారు. మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తారు. బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష, శ్లాబ్ నిర్మాణం జరిగే సమయంలో రూ.లక్ష ఇస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తరవాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష ఇస్తారు.
- ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.
- ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఇటీవలనే ప్రభుత్వం నమూనాలను ఖరారు చేసింది. స్థలాన్ని బట్టి సింగిల్‌బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్న వారికి కూడా ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం చెప్పింది.
- జిల్లా ఇంఛార్జ్ మంత్రి అధ్యక్షతన లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ఫైనలైజ్ చేస్తారు.
- ప్రతి ఏడాది 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. దాని ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయిస్తుంది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వు కోటా కింద ఉంచాలని సర్కార్ నిర్ణయించింది.
- రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు జిల్లాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
కొత్తగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..?
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఈ సమయంలో దరఖాస్తు చేసుకోలేని వారు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనే దానిపై గందరగోళానికి గరువుతున్నారు. అయితే కొత్తగా కూడా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఇటీవలే గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అప్లికేషన్లను స్వీకరించింది. మరోసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రకటిస్తే… అందులో ఇందిరమ్మ ఇంటికోసం అప్లికేషన్ చేసుకోవచ్చు.