తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kothagudem Fro Killing: అదంతా అడవేనా..! అసలు ఎర్రబోడు ఎప్పుడు ఏర్పడింది..?

Kothagudem FRO killing: అదంతా అడవేనా..! అసలు ఎర్రబోడు ఎప్పుడు ఏర్పడింది..?

27 November 2022, 9:04 IST

    • encroachments in yerrabodu village: అటవీ అధికారి శ్రీనివాసరావు దారుణ హత్య నేపథ్యంలో.. అందరి చూపు ఎర్రబోడుపై పడింది. అసలు ఈ గ్రామం ఎప్పట్నుంచి ఉంది..? అటవీ భూముల లెక్కంత..? గుత్తి కోయలు అడవిని అక్రమించారా..? వంటి అంశాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అటవీశాఖ అధికారులు.
ఎర్రబోడు గ్రామం
ఎర్రబోడు గ్రామం

ఎర్రబోడు గ్రామం

Kothagudem FRO murdered by Gutti Koya tribal: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావును అత్యంత దారుణంగా హత్య చేశారు గుత్తి కోయలు. ఇది దేశంలోనే అత్యంత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో చర్చ అంతా ఘటన జరిగిన గ్రామమైన ఎర్రబోడుపైనే జరుగుతోంది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రబోడు ఎప్పుడు ఏర్పడింది..? ఎంతమంది గుత్తికోయలు ఉంటారనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

శ్రీనివాసరావు హత్యకు గురైన ఎర్రబోడు గ్రామం పదేండ్ల క్రితం అసలు ఉనికిలోనే లేదని అటవీశాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ 2013 వరకు దట్టమైన అడవి ఉండేదని తెలిపింది. అడవిని ధ్వంసంచేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తేల్చారు. శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. అయితే 2003 నుంచి ఎర్రబోడు ఉందని ఓవైపు చర్చ జరుగుతుండగా... అసలు 2013 నాటికి కూడా ఎర్రబోడు గ్రామం ఉనికిలోనే లేదని అంటున్నారు.

2013 తర్వాతనే అక్కడ అటవీ ప్రాంతం కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చిందని, ఇందుకు ప్రధాన కారణం గుత్తి కోయలని అటవీ అధికారులు నిర్ధారించారు. అక్కడ అడవిని నరికి నివాసం ఏర్పాటు చేసుకున్నారని, పోడు చేశారని అంటున్నారు. శాటిలైట్ చిత్రాలను విశ్లేషించగా... 2015-16లో అక్కడ కొన్ని గుడిసెలు వెలిశాయని, 2018 కల్లా ఇండ్ల నిర్మాణాలతో ఒక అవాసం ఏర్పడిందని చెబుతున్నారు. ఈ ఆవాసం చండ్రుగొండ మండలం బేడలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో మొత్తం 35 హెక్టార్లలో అడవిని నరికారని, ఇందులో 15 హెక్టార్లు కొత్తగూడెం డివిజన్‌లోకి వస్తుందని అధికారులు వివరిస్తున్నారు. ఇక్కడ 35 - 40 ఆవాసాలు ఉన్నట్లు తేల్చారు.

మరోవైపు ఎర్రబోడులో నివాసం ఉంటున్న గుత్తి కోయల వాదన మరోలా ఉంది. 2003 నుంచి తాము ఎర్రబోడులోనే ఉంటున్నామని అంటున్నారు. నాటి నుంచి వ్యవసాయం చేస్తున్నామని… పత్తి, మొక్కజొన్న, వరి సాగు చేస్తూ జీవిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.

ఇక బెండలపాడు గ్రామ పంచాయతీ... కీలక తీర్మానం చేసింది. ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు మృతికి కారణమైన గుత్తి కోయలను బహిష్కరిస్తూ గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. హత్య ఘటనను ఈ సందర్భంగా గ్రామసభ తీవ్రంగా ఖండించింది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి అక్కడ నివసిస్తున్న గుత్తి కోయలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఎర్రబోడులో ఉంటున్న గుత్తికోయలతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని బెండలపాడు గ్రామస్థులు చెబుతున్నారు. వారు గంజాయి, నాటుసారా సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుత్తి కోయల తీరు చాలా ప్రమాదకరంగా ఉందని, మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారని అంటున్నారు. వారి తీరుతో తమకు కూడా ప్రాణహాని పొంచి ఉందని తీర్మానంలో వివరించారు.

ఎక్కడ్నుంచి వచ్చారు…

దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి చాలామంది గిరిజనులు ఏపీ(AP), తెలంగాణ(Telangana) సరిహద్దుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చాలా గ్రామాలు ఏర్పడ్డాయి. కొండ ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ.. పోడు(Podu) వ్యవసాయం చేసుకుంటున్నారు. వీళ్లంతా ఇక్కడకు రావడానికి బలమైన కారణం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు(Maoists), సల్వాజుడుం దళాల నడుమ జరిగిన పోరులో చాలామంది అన్నీ కోల్పోయారు. సల్వాజుడుం దళానికి పోలీసులు మద్దతు ఇస్తారనే వాదన కూడా ఉంది. ఇలా మావోయిస్టులు, పోలీసుల నడుమ నలిగిపోతూ.. చాలామంది ఏపీ, తెలంగాణ(Telangana) సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. కొంతమంది ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా వెళ్లారు.

ఉమ్మడి ఏపీలో వీళ్లంతా ఇక్కడకు వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh).. దంతేవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్ లాంటి ప్రాంతాల నుంచి వీళ్ళంతా వచ్చారు. వారినే గుత్తికోయలు అంటారు. అయితే అధికారికంగా మాత్రం గుత్త కోయ అని ఉంటుందని తెలుస్తోంది. అలా వచ్చి.. బతుకుదెరువు కోసం.. పంటలు పండిస్తూ ఉన్నారు. పశు పోషణ కూడా చేస్తారు. అటవీ ఉత్పత్తులు కూడా సేకరిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 నుంచి 30 వేల మంది ఇక్కడకు వచ్చారు. ఏపీ, తెలంగాణలో స్థిరపడ్డారు.

తాజాగా వివాదం నడిచిన ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో 120 కంటే ఎక్కువగా గుత్తికోయ గ్రామాలు ఉన్నాయి. వేల మంది ఇక్కడ బతుకుతున్నారు. పోలీసు కేసులు, గుత్తికోయల అరెస్టులు చాలానే జరిగాయి. అంతకుముందు కూడా మంచిర్యాల జిల్లాతోపాటుగా కొన్ని జిల్లాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇలానే వివాదాలు నడిచాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల్లోను ఎక్కువ సంఖ్యలోనే గుత్తికోయలు ఉన్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబోడు గ్రామం విషయంలో అటవీశాఖ అధికారులు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గుత్తి కోయలు అక్రమించిన పోడు భూములను స్వాధీనం చేసుకుంటారా..? వారిని అక్కడ్నుంచి పంపిస్తారా..? అసలు ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్ గా ఉంది.