Telugu News  /  Telangana  /  Bendalapadu Village Decides To Expel Gutti Koyas Over Fro Killing In Kothagudem
ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు (ఫైల్ ఫొటో)
ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు (ఫైల్ ఫొటో)

FRO's killing in Kothagudem: మర్డర్ ఎఫెక్ట్.. గుత్తికోయల బహిష్కరణ..!

26 November 2022, 22:03 ISTHT Telugu Desk
26 November 2022, 22:03 IST

Kothagudem FRO Murder Case: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలను ఊరి నుంచి బహిష్కరించాలని గ్రామసభ తీర్మానించింది.

Kothagudem FRO murdered by Gutti Koya tribal: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావును అత్యంత దారుణంగా హత్య చేశారు గుత్తి కోయలు. ఇది దేశంలోనే అత్యంత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన గ్రామ... కీలక తీర్మానం చేసింది. ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు మృతికి కారణమైన గుత్తి కోయలను బహిష్కరిస్తూ గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. హత్య ఘటనను ఈ సందర్భంగా గ్రామసభ తీవ్రంగా ఖండించింది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి అక్కడ నివసిస్తున్న గుత్తి కోయలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ హత్యకు పాల్పడిన గుత్తి కోయలను వారి సొంత ప్రాంతమైన ఛత్తీస్ ఘడ్ కు పంపాలని కోరుతున్నారు గ్రామంలోని స్థానికులు. గుత్తికోయలు ఉంటున్న ఎర్రబోడు... బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. అయితే ఎర్రబోడులో ఉంటున్న గుత్తికోయలతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని బెండలపాడు గ్రామస్థులు చెబుతున్నారు. వారు గంజాయి, నాటుసారా సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుత్తి కోయల తీరు చాలా ప్రమాదకరంగా ఉందని, మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారని అంటున్నారు. వారి తీరుతో తమకు కూడా ప్రాణహాని పొంచి ఉందని తీర్మానంలో వివరించారు.

గుత్తి కోయల నేపథ్యం...

దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి చాలామంది గిరిజనులు ఏపీ(AP), తెలంగాణ(Telangana) సరిహద్దుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చాలా గ్రామాలు ఏర్పడ్డాయి. కొండ ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ.. పోడు(Podu) వ్యవసాయం చేసుకుంటున్నారు. వీళ్లంతా ఇక్కడకు రావడానికి బలమైన కారణం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు(Maoists), సల్వాజుడుం దళాల నడుమ జరిగిన పోరులో చాలామంది అన్నీ కోల్పోయారు. సల్వాజుడుం దళానికి పోలీసులు మద్దతు ఇస్తారనే వాదన కూడా ఉంది. ఇలా మావోయిస్టులు, పోలీసుల నడుమ నలిగిపోతూ.. చాలామంది ఏపీ, తెలంగాణ(Telangana) సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. కొంతమంది ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా వెళ్లారు.

ఉమ్మడి ఏపీలో వీళ్లంతా ఇక్కడకు వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh).. దంతేవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్ లాంటి ప్రాంతాల నుంచి వీళ్ళంతా వచ్చారు. వారినే గుత్తికోయలు అంటారు. అయితే అధికారికంగా మాత్రం గుత్త కోయ అని ఉంటుందని తెలుస్తోంది. అలా వచ్చి.. బతుకుదెరువు కోసం.. పంటలు పండిస్తూ ఉన్నారు. పశు పోషణ కూడా చేస్తారు. అటవీ ఉత్పత్తులు కూడా సేకరిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 నుంచి 30 వేల మంది ఇక్కడకు వచ్చారు. ఏపీ, తెలంగాణలో స్థిరపడ్డారు.

తాజాగా వివాదం నడిచిన ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో 120 కంటే ఎక్కువగా గుత్తికోయ గ్రామాలు ఉన్నాయి. వేల మంది ఇక్కడ బతుకుతున్నారు. పోలీసు కేసులు, గుత్తికోయల అరెస్టులు చాలానే జరిగాయి. అంతకుముందు కూడా మంచిర్యాల జిల్లాతోపాటుగా కొన్ని జిల్లాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇలానే వివాదాలు నడిచాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల్లోను ఎక్కువ సంఖ్యలోనే గుత్తికోయలు ఉన్నారు.