Gutti Koya Tribals : గుత్తికోయలు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు?-who is guttikoya tribals and why controversy with forest department ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Who Is Guttikoya Tribals And Why Controversy With Forest Department

Gutti Koya Tribals : గుత్తికోయలు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Guttikoyas : భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ పై గుత్తికోయలు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఆయన చనిపోయారు. ఇంతకీ ఈ గుత్తికోయలు ఇక్కడి వాళ్లేనా? లేదా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లు ఎంతమంది ఉన్నారు?

గుత్తికోయల(Gutti Koya) అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఫారెస్ట్ అధికారి(Forest Officer) శ్రీనివాస్ ను వెంటాడి.. కొడవళ్లతో దాడి చేశారు. ముందుగా కర్రతో కొట్టగా ఆయన కిందపడిపోయారు. వెంటనే వేట కొడవళ్లతో దాడి చేశారు. పోడు భూముల్లో(Podu Lands) ప్లాంటేషన్ విషయంపై వచ్చిన గొడవలో భాగంగా వివాదం రేగింది. ఇందులో భాగంగా ఆయనపై దాడి చేయగా చనిపోయారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇప్పుడు గుత్తికోయల విషయం చర్చకు వస్తుంది. వీళ్లు ఇక్కడి వాళ్లేనా?

ట్రెండింగ్ వార్తలు

దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి చాలామంది గిరిజనులు ఏపీ(AP), తెలంగాణ(Telangana) సరిహద్దుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చాలా గ్రామాలు ఏర్పడ్డాయి. కొండ ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ.. పోడు(Podu) వ్యవసాయం చేసుకుంటున్నారు. వీళ్లంతా ఇక్కడకు రావడానికి బలమైన కారణం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు(Maoists), సల్వాజుడుం దళాల నడుమ జరిగిన పోరులో చాలామంది అన్నీ కోల్పోయారు. సల్వాజుడుం దళానికి పోలీసులు మద్దతు ఇస్తారనే వాదన కూడా ఉంది. ఇలా మావోయిస్టులు, పోలీసుల నడుమ నలిగిపోతూ.. చాలామంది ఏపీ, తెలంగాణ(Telangana) సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. కొంతమంది ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా వెళ్లారు.

ఉమ్మడి ఏపీలో వీళ్లంతా ఇక్కడకు వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh).. దంతేవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్ లాంటి ప్రాంతాల నుంచి వీళ్ళంతా వచ్చారు. వారినే గుత్తికోయలు అంటారు. అయితే అధికారికంగా మాత్రం గుత్త కోయ అని ఉంటుందని తెలుస్తోంది. అలా వచ్చి.. బతుకుదెరువు కోసం.. పంటలు పండిస్తూ ఉన్నారు. పశు పోషణ కూడా చేస్తారు. అటవీ ఉత్పత్తులు కూడా సేకరిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 నుంచి 30 వేల మంది ఇక్కడకు వచ్చారు. ఏపీ, తెలంగాణలో స్థిరపడ్డారు.

తాజాగా వివాదం నడిచిన ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో 120 కంటే ఎక్కువగా గుత్తికోయ గ్రామాలు ఉన్నాయి. వేల మంది ఇక్కడ బతుకుతున్నారు. పోలీసు కేసులు, గుత్తికోయల అరెస్టులు చాలానే జరిగాయి. అంతకుముందు కూడా మంచిర్యాల జిల్లాతోపాటుగా కొన్ని జిల్లాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇలానే వివాదాలు నడిచాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల్లోను ఎక్కువ సంఖ్యలోనే గుత్తికోయలు ఉన్నారు.

తాజాగా గుత్తికోయలకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య పోడు భూముల విషయంపైనే వివాదం జరిగింది. కొన్ని రోజులుగా ఫారెస్ట్ అధికారులు, ఆదివాసులకు నడుమ పోడు భూముల విషయంలో వివాదం నడుస్తోంది. బెండలపాడు సమీపంలో ఎర్రబొడు అటవీ ప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు.. మెుక్కలు నాటారు. వాటిని గుత్తికోయలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే విషయంపై వివాదం నడుస్తోంది. ఫారెస్ట్ అధికారులు.. ప్లాంటేషన్(Plantation) చేయడాన్ని నిరసిస్తూ.. మళ్లీ భూముల్లోకి వచ్చారు కోయలు. మెుక్కలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే గొడవ జరిగి.. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై దాడి చేయగా ఆయన మృతి చెందారు. మరికొద్ది రోజుల్లో పోడు భూముల పరిష్కారం దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో... గుత్తి కోయలకు పట్టాలు ఇస్తారా..? ఇస్తే ఎంతమందికి ఇస్తారు..? అనేది ఆసక్తికరంగా మారనుంది.

టాపిక్