Telangana Assembly : అసెంబ్లీలో సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్ - వాడీవేడీగా 'కేంద్ర పద్దు'పై చర్చ..!
24 July 2024, 14:03 IST
- Telangana Assembly Sessions 2024 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర పద్దుపై కేటీఆర్ మాట్లాడగా… సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర బడ్జెట్ నిధులు - తెలంగాణ అసెంబ్లీ చర్చ
Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఇందులో ఆర్టీసీపై సభ్యులు పలు ప్రశ్నలు సంధించగా…మంత్రి పొన్నం జవాబునిచ్చారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రజలు బుద్ధి చెప్పినా… బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదంటూ విమర్శలు గుప్పించారు.
మధ్యాహ్నం తర్వాత కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సభలో చర్చ మొదలైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సభలో ప్రకటన చేసింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున చేసిన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. ఏపీకి కేంద్రం ఏమిచ్చినా తమకు అభ్యంతరం లేదని… దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
దీనిపై బీఆర్ఎస్ తరపున కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర బడ్దెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానానికి తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి చాలా సార్లు విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ…. ఎలాంటి సాకారం అందలేదన్నారు. ఇదే విషయం ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ప్రసంగం ప్రారంభమైన సమయంలో కొన్ని వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చిందే మీ అభిప్రాయమా.? అంటూ బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్న ఆయన… స్వయం కృషితో సభలోకి వచ్చానని కామెంట్స్ చేశారు. తండ్రిపేరు చెప్పుకుని రాలేదని.. వివాదాల వైపు చర్చలొద్దని హితవు పలికారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ… పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ సెటైర్లు విసిరారు. రేవంత్ రెడ్డి ఎవర్నీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతుగా వస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మాట్లాడాలని సూచించారు.
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్….
కేటీఆర్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కేటీఆర్ సత్య దూరమైన విషయాలను మాట్లాడారని విమర్శించారు. ఏదో చేసినట్టు చెప్పే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. 2014 - 2021 వరకు రాజ్యసభలో మోదీ ప్రభుత్వానికి మద్దతు లేదని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి… పదే పదే తీసుకొచ్చే బిల్లులకు మద్దతు ఇచ్చారని అన్నారు. జీఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు అందరి కంటే ముందే నాటి సీఎం కేసీఆర్ ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అసెంబ్లీలో చెప్పారని తెలిపారు.
మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాత తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు… బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇదంతా కూడా మోదీకి మద్దతుగా నిలిచేందుకే చేశారని ఆరోపించారు. ఆర్టీఐ సవరణ బిల్లుకు కూడా బీఆర్ఎస్ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటు వేశారని అన్నారు. నోట్ల రద్దుకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని సీఎం గుర్తు చేశారు.
అవసరమైన ప్రతి సమయంలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసిన బీఆర్ఎస్… ఇవాళ పోరాడామని చెప్పటం సిగ్గుచేటు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగాలు పలు బిల్లుల అంశాాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారని… డబ్బులు కూడా అవసరం లేదని, కేవలం ప్రధాని ప్రేమ ఉంటే చాలు అని కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. గాలి మాటలు మాట్లాడితే సహించేదే లేదన్నారు.