Union Budget :కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి 'గుండు సున్నా', తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం-కేటీఆర్, హరీశ్ రావు
BRS On Union Budget : కేంద్ర బడ్జెట్ లో మరోసారి తెలంగాణకు గుండు సున్నా నిధులు అంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు చేశారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు.
BRS On Union Budget : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యం అని కేటీఆర్ అన్నారు. రూ. 48 లక్షల 21 వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామన్నారు. బడ్జెట్ లో ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు.
సీఎం దిల్లీ వెళ్లి అడిగినా నిధులు రాలేదు
"రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు. ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా కేంద్రం స్పందించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి దిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు. తెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా. తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన తెలియజేస్తోంది" - కేటీఆర్
ఏపీ, బీహార్ కు మాత్రమే నిధులు
పార్లమెంట్ లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదని కేటీఆర్ ఆరోపించారు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్ ఉంటే కేంద్ర వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లమన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదన్నారు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన, వారు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడా కూడా తెలంగాణ అనే పదం ప్రస్తావించలేదన్నారు. రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారని, ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు సంతోషమే అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ అన్న పదమే రాలేదు
"కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారు, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు?. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా"- మాజీ మంత్రి హరీశ్ రావు
సంబంధిత కథనం