Ponnam Prabhakar : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేయండి- బండి సంజయ్ కు మంత్రి పొన్నం లేఖ-karimnagar minister ponnam prabhakar letter to union minister bandi sanjay on budget allocations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponnam Prabhakar : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేయండి- బండి సంజయ్ కు మంత్రి పొన్నం లేఖ

Ponnam Prabhakar : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేయండి- బండి సంజయ్ కు మంత్రి పొన్నం లేఖ

HT Telugu Desk HT Telugu

Ponnam Prabhakar Letter : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ముఖ్యంగా కరీంనగర్ కు అధిక నిధులు కేటాయించేలా కృషి చేయాలని కోరారు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేయండి

Ponnam Prabhakar Letter : కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక నిధులు బడ్జెట్ లో కేటాయించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల కేంద్ర మంత్రి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య రాజకీయ విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. వలస రాజకీయాలపై కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి కాంగ్రెస్ ఉపఎన్నికకు సిద్ధం కావాలని బండి సంజయ్ వ్యాఖ్యానించగా అసలు బీజేపీ కూల్చిన పలు రాష్ట్రాల్లో బీజేపీలో చేరిన ఎంతమంది ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. విమర్శలు ప్రతివిమర్శలు నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మంత్రి పొన్నం సుదీర్ఘ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వచ్చే బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయింపులు జరిగేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో కోరారు. తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైందన్నారు.

బహిరంగ లేఖ సారాంశం

రాష్ట్ర మంత్రిగా కరీంనగర్ బిడ్డ గా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైన బడ్జెట్ కోసం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను

1.స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం.

2.మిడ్ మానేరు , గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత భాదిత కుటుంబాలకు సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన

3. శాతవాహన విశ్వవిద్యాలయానికి రూ.200 కోట్ల ఆర్థిక సహాయం అందించడం

4. కరీంనగర్ తిరుపతి మధ్య నడిచే బై విక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి రోజు నడిచేలా చేయాలి

5. కరీంనగర్, షిర్డీ మధ్య రైల్వే మార్గం డబ్లింగ్‌ను వేగవంతం చేయడం

6.హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజీ మంజూరు

7..కొత్తపల్లి నుండి జనగాం జాతీయ రహదారి మంజూరు

8. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు

9..వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు

10. NLM, PMEG, NHM పథకాల కింద తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

రాబోయే బడ్జెట్ సమావేశాలలో అభివృద్ధి పనులను కార్యరూపం దాల్చేందుకు కరీంనగర్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలని కోరుతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ ద్వారా తెలిపారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం