AP Assembly Session 2024 : ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
01 February 2024, 15:22 IST
- AP Assembly Session 2024 Updates: ఈనెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024
AP Assembly Session 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (Business Advisory Committee) సమావేశంలో నిర్ణయించనున్నారు.
తాజాగా ఏపీ మంత్రివర్గం కూడా భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రెండేళ్లపాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ డీఎస్సీతో పాటు మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి ఇవ్వాలని నిర్ణయించింది. డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దుకు అంగీకరించింది. సీఎం జగన్ కుటుంబ సభ్యుల భద్రతకు స్పెషల్ సెక్యూరిటీ కింద 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యాశాఖలో పలు ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది.
కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వివరించారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత నిధులు విడుదల చేస్తామన్నారు. వచ్చే వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ లో 6,100 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.