AP Cabinet Decisions : అటవీశాఖలో 689 పోస్టుల భర్తీ, నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయసు పెంపు -కేబినెట్ కీలక నిర్ణయాలు-amaravati news in telugu ap cabinet key decisions dsc notification ysr cheyutha funds ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Decisions : అటవీశాఖలో 689 పోస్టుల భర్తీ, నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయసు పెంపు -కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Decisions : అటవీశాఖలో 689 పోస్టుల భర్తీ, నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయసు పెంపు -కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్... వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల, డీఎస్సీ నోటిఫికేషన్ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నాన్ టీచింగ్ స్టాప్ పదవీ విరమణ వయస్సు పెంపు, అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Decisions : సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయలం మొదటి బ్లాక్ లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. దీంటో పాటు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

విండ్ పవర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఎస్ఈఆర్టీతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలని నిర్ణయించింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్జేయూకేటీలో రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది.

విద్యాశాఖలో పదోన్నతులు, బదిలీలు

న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి ఇవ్వాలని నిర్ణయించింది. డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దుకు అంగీకరించింది. సీఎం జగన్ కుటుంబ సభ్యుల భద్రతకు స్పెషల్ సెక్యూరిటీ కింద 25 మంది హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యాశాఖలో పలు ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది.

వచ్చే వారంలో డీఎస్సీ నోటిఫికేషన్

కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వివరించారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత నిధులు విడుదల చేస్తామన్నారు. వచ్చే వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ లో 6100 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇవాళ సాయంత్రం డీఎస్సీ నోటిఫికేషన్, విధి విధానాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం కానున్నారన్నారు. బీసీ కులగణనపై చంద్రబాబు అనలేక పవన్ తో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు మంచి జరుగుతోంటే పవన్ తప్పు పడతారా? అని ప్రశ్నించారు. ఎవరెన్ని బాణాలు వేసినా అవి జగన్ కు హారాలు అవుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 మాలలు సీఎం జగన్ మెడలో వేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.

సంబంధిత కథనం